
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప-2 (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sritej) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సినిమా రిలీజ్ అయి మూడు నెలలు దాటినా ఇంకా శ్రీతేజ్ స్పృహలోకి రాలేదని వైద్యులు తెలిపారు.
శ్రీతేజ్ హెల్త్ అప్డేట్
సోమవారం రోజున కిమ్స్ డాక్టర్లు శ్రీతేజ్ (Sritej health Update) ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీతేజ్ ప్రస్తుతం వెంటిలేటర్ అవసరం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ద్వారా అతడి పొట్టలోకి ఆహారం పంపిస్తున్నట్లు వెల్లడించారు. అయితే శ్రీతేజ్ ఇంకా స్పృహలోకి రాలేదని.. అతడి శరీరంలోని కదలికల కోసం ఫిజయోథెరపీ చేస్తున్నట్లు వివరించారు.
అసలేం జరిగిందంటే..?
గతేడాది డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో (Pushpa 2 Benefit Show) సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. ఆయణ్ను చూసేందుకు అందరూ ఎగబడటంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపుతప్పాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా తొక్కిసలాట జరిగింది.
అల్లు అర్జున్ అరెస్టు
ఈ ఘటనలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. రేవతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, కుమారుడు శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ కావడంతో ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun Arrest) పై కేసు నమోదు కాగా ఆయన ఒక రాత్రి జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.