గతేడాది జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్మోర్‌లు ఐఎస్‌ఎస్ (ISS)కు చేరుకున్న విషయం తెలిసిందే. వారంలోగా భూమ్మీదకు చేరుకోవాల్సిన వారు.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వ్యోమగాములు లేకుండానే నౌక భూమిని చేరుకుంది. ఇక ఈ ఇద్దరు గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వీళ్లను తిరిగి భూమ్మీదుకు తీసుకువచ్చేందుకు నాసా స్పేస్‌ఎక్స్(SpaceX)తో కలిసి పని చేస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమిని చేరుకోనున్నారు.
రేపు సాయంత్రం భూమ్మీదకు
అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ భూమ్మీద ల్యాండ్ అవుతారని నాసా (NASA) తాజా ప్రకటించింది. వీరిద్దరిని తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైనట్లు నాసా తెలిపింది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించడంతో అక్కడ చిక్కుకున్న వ్యోమగాముల రాకకు మార్గం సుగమమైనట్లు పేర్కొంది.
మరికొన్ని గంటలు మాత్రమే
క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.45 గంటలకు మొదలవుతుందని వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభమై.. మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు భూమికి తిరుగు పయనమవుతుంది. అదే రోజు సాయంత్రం 5.11 గంటలకు భూకక్ష్యలను దాటుకుని కిందకు వచ్చి.. 5.57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకురానున్నట్లు నాసా వెల్లడించింది.






