తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోతుంది, తమ అభిమాన నేతలు గెలుస్తారా లేదా అన్న ఉత్కంఠ సాధారణ ఓటర్లలోనూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుస విజయాలు సాధించింది. మరోసారి గెలిస్తే హ్యాట్రిక్ కొట్టడం కూడా ఖాయం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్దితులు మారుతున్నాయనే చర్చ జరుగుతున్న వేళ సీ నెక్స్ట్ సంస్ధ నిర్వహించిన సర్వే ఫలితాలు అందుకు తగ్గట్టే కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ప్రస్తుత పరిస్దితుల్ని బట్టి ఈ నెల 21 వరకూ ఉన్న అంచనాల్ని సీ నెక్స్ట్ సంస్ధ సర్వే రూపంలో విడుదల చేసింది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించిన ఈ సర్వే అంచనాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఏకంగా 91 సీట్లు రాబోతున్నట్లు సీ నెక్స్ట్ సర్వే అంచనా వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడినట్లు ఈ సర్వే అంచనాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ తర్వాతి స్ధానంలో అధికార బీఆర్ఎస్ కేవలం 14 సీట్లకే పరిమితం కాబోతున్నట్లు టీ నెక్స్ట్ సర్వే తేల్చింది. బీజేపీకి 5 సీట్లు రాబోతున్నాయని, బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం కూడా కేవలం 4 సీట్లకే పరిమితం కాబోతుందని ఈ సర్వే చెబుతోంది. అలాగే బీఎస్పీ ఒక్క సీటులో గెలవబోతోందని తేలింది. అయితే వీటితో పాటు మరో ఐదు సీట్లలో గట్టి పోటీ నెలకొందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
తెలంగాణలో గట్టి పోటీ నెలకొన్న ఐదు సీట్లలో కరీంనగర్, సిరిసిల్ల, నర్సాపూర్, చేవెళ్ల,మలక్ పేట్ ఉన్నాయి. కరీంనగర్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య, సిరిసిల్లలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య, నర్సాపూర్ లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య, చేవెళ్లలోనూ బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య, మలక్ పేట్ లో ఎంఐఎం-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. అలాగే ఈ సర్వేలో పలు సంచనాలు కూడా నమోదు కాబోతున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ తాను పోటీ చేస్తున్న రెండు సీట్లలోనూ ఓడిపోతున్నట్లు ఈ సర్వే తేల్చింది. గజ్వేల్ లో ఈటెల రాజేందర్ చేతిలోనూ, కామారెడ్డితో రేవంత్ రెడ్డి చేతిలోనూ కేసీఆర్ ఓడిపోతున్నట్లు ఈ సర్వే చెబుతోంది. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా పోటీ చేస్తున్న రెండు స్ధానాల్లోనూ గెలవబోతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అలాగే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్ధానంలో బీఎస్పీ అభ్యర్ధిగా గెలవబోతున్నట్లు ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.