తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రేపు(నవంబర్ 3) విడుదల కానుంది. నవంబర్ 3 నుంచి నవంబర్ 10వరకు నామినేష్లనను ఆన్‌లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. SUVIDHA.ECI.GOV.IN ద్వారా నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రేపు(నవంబర్ 3) నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 10వరకు నామినేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 30న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈ సారి నామినేషన్ల ప్రక్రియ ఈజీ కానుంది. ఆన్‌లైన్‌లోనే నామినేషన్లు వేయవచ్చు. గతంలో నామినేషన్లు వేయడానికి వెళ్లిన అభ్యర్థులు చాలా సార్లు ఇంటికి ఆఫీస్‌కు తిరుగుతుండేవారు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ లేదు.. ఈ పత్రం లేదు అని ఆఫీసర్ల దగ్గర నుంచి సమాధానం వస్తుండేది. ఈ సారి ఆ కష్టాలు లేనట్లే అనుకోవాలి.
ఎందులో దరఖాస్తు చేసుకోవాలి?
ఎందుకంటే ఆన్‌లైన్‌లోనే నామినేషన్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో ముందుగానే తెలుస్తుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫారాలను నింపి హార్డ్ కాపీలను రిటర్నింగ్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఫిక్స్ చేసిన డేట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం మూడు సెట్ల దరఖాస్తులను సబ్మిట్ చేయాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వివరాలే ఆ డాక్యుమెంట్స్‌లో ఉండాలి.అటు అభ్యర్థుల నుంచి మాన్యువల్ దరఖాస్తుల స్వీకరణ ఎప్పటిలాగే ఉంటుంది. SUVIDHA.ECI.GOV.IN ద్వారా నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 13న ఉంది. నవంబర్ 15 లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్(RO) కార్యాలయంలోకి అనుమతిస్తారు.ఇక RO కార్యాలయానికి
100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ ఉంటుంది. అభ్యర్థికి చెందిన మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నవంబర్ 3 నుంచి 10 వరకు అన్ని వర్కింగ్ డేస్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మరోవైపు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి(రేపటి నుంచి) ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాలి. సభలు, ర్యాలీల స్థలం, సమయం, ఇతర వివరాలను స్థానిక పోలీసు అధికారులకు చెప్పాలి. లౌడ్ స్పీకర్లకు అనుమతులు తప్పనిసరి.