ManaEnadu : తిరుమల లడ్డూ (Tirumala Laddu Issue)లో కల్తీ నెయ్యి వాడకం వివాదం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏపీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే ఈ వ్యవహారంతో అసలు దేవాలయాల్లో ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యతపై తొలిసారిగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రసాదాల తయారీ (Prasadam Making) వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై విజయ నెయ్యినే వాడాలి
టెండర్లతో పని లేకుండా ఇకపై ఆలయాల్లో ‘విజయ’ నెయ్యి (Vijaya Ghee)నే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ రంగంలోని సంస్థ అయిన విజయ సంస్థ నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తున్నా.. చాలా వరకు దేవాలయాలు ఈ సంస్థను పటించుకోకుండా ప్రైవేటు కంపెనీలకే ప్రాధాన్యమిస్తుండటంతో విజయ డెయిరీ (Vijaya Dairy) నెయ్యి కొనుగోళ్లు మందగించాయి. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 50 టన్నులకు పైగా నెయ్యి నిల్వ ఉంది. ఇది ఎక్కువ రోజులు ఉంటే నాణ్యత దెబ్బతింటుందని గుర్తించిన అధికారులు తమ సంస్థ వద్ద నెయ్యిని కొనుగోలు చేయాలని మార్చి 15న, జూన్ 1న దేవాదాయశాఖకు, రాష్ట్రంలోని అన్ని దేవాలయాల (Telangana Temples)కు లేఖలు రాసింది.
ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్
మొన్నటివరకు దీనిపై ఎలాంటి స్పందన లేదు. కానీ తాజాగా తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy) నేపథ్యంలో డెయిరీ ఉన్నతాధికారులు మరోసారి తమ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రంలోని దేవాలయాల్లో ఒక్కటి కూడా విజయ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో విజయ డెయిరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.