ManaEnadu : హమ్మయ్య.. 6 PM అయ్యింది అని అలా సిస్టమ్ లాగౌట్ చేసి.. ఇలా బయటకు వచ్చామో లేదో.. బాస్ నుంచి కాల్ ప్రాజెక్టు గురించి మాట్లాడాలని..
సరదాగా వీకెండ్ (Weekend) లో ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తే.. కరెక్టు మూవీలో ట్విస్ట్ రివీల్ అయితున్న సమయంలో ఇక్కడ మీ మొబైల్ ఫోన్ మోగుతుంది. కాలర్ ఐడీ చూస్తే ఆ కాల్ వచ్చింది బాస్ నుంచి. అంతే ఇక సినిమా చూడాలన్న మూడు, ఉత్సాహం అంతా క్షణంలో ఎగిరిపోతుంది.
జాలీగా ఫ్రెండ్స్ తో టూర్ కు వెళ్లారనుకోండి. కష్టాలన్నీ మరిచిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరో ప్రపంచంలోకి అడుగుపెడుతున్నామనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా మోగిన మీ మొబైల్ సౌండు మిమ్మల్ని ఆ ఊహా లోకం నుంచి వెనక్కి తీసుకొచ్చేస్తుంది. చూస్తే ఆ కాల్ వచ్చింది బాస్ (Work Call) నుంచి.
ఇలా మీరు లీవ్ లో ఉన్నప్పుడు, ఆఫీస్ వర్క్ టైమింగ్స్ (Working Hours) పూర్తయ్యాక చాలా మంది తమ బాస్ నుంచి వచ్చే కాల్స్ తో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కాల్ రిసీవ్ చేయకపోతే మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లిన తర్వాత ఉద్యోగం ఉంటుందో ఊడుతుందోనన్న భయంతో చాలా మంది కాల్ లిఫ్ట్ చేసి ఉన్నఫలంగా ఆఫీసుకు వెళ్తారు. అయితే మీ వర్కింగ్ అవర్స్ పూర్తైన తర్వాత బాస్ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్ లను రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం రైట్ టు డిస్ కెనెక్ట్ (Right To Disconncet) ప్రకారం వర్కింగ్ అవర్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగులను శిక్షించే అధికారం బాస్‌లకు ఉండదు. ఇంతకీ ఈ చట్టం ఏం చెబుతోంది.. ?ఇది ఇండియాలో అమల్లో ఉందా..?
రైట్ టు డిస్‌కనెక్ట్
రైట్ టు డిస్ కనెక్ట్ చట్టం ప్రస్తుతానికైతే భారత్ (India) లో అమల్లో లేదు. కానీ 20 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అమల్లో ఉంది. ప్రధానంగా యూరప్, లాటిన్ అమెరికాలలో ఇలాంటి నియమాలు ఇప్పటికే ఉన్నాయి. ఆఫీసు పని అయ్యాక బాస్‌లు తమ ఉద్యోగులకు కాల్ చేయడాన్ని ఈ చట్టం నిషేధించదు. కానీ ఆ కాల్స్, మెసేజ్ లకు ఉద్యోగులు స్పందించాలా లేదా అన్నది మాత్రం వారి ఇష్టమని ఈ చట్టం చెబుతోంది. ఆస్ట్రేలియాలో ఇటీవలే ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
ఆఫీసయ్యాక బాస్ కాల్ చేస్తే
ఆస్ట్రేలియా (Australia)లో ఈ చట్టం ప్రకారం వర్కింగ్ అవర్స్ తర్వాత కాల్స్ అనే విషయాన్ని యజమానులు, ఉద్యోగులు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఇద్దరూ ఒక కన్ క్లూజన్ కు రాలేకపోతే మాత్రం ఆస్ట్రేలియా ఫెయిర్ వర్క్ కమిషన్ (FWC)ను సంప్రదించవచ్చు. వర్కింగ్ అవర్స్ తర్వాత ఉద్యోగిని సంప్రదించడం మానేయమని ఎఫ్‌డబ్ల్యూసీ కంపెనీ యజమానిని ఆదేశించవచ్చు. అయితే పరిస్థితిని బట్టి ఉద్యోగి కాల్స్ రిసీవ్ చేయడం అసమంజసమని భావిస్తే కాల్స్ రిసీవ్ చేసుకోవాలని ఉద్యోగిని ఆదేశించే అధికారం కూడా FWCకి ఉంది.
ఈ చట్టం ఎంతో ఉపయోగకరం
ఆస్ట్రేలియాలో ఈ కొత్త చట్టాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. ఈ చట్టం తమ వర్క్-పర్సనల్ లైప్ బ్యాలెన్స్ (Work Personal Life Balance) కు ఎంతో ఉపయోగపడుతుందని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు సిబ్బందికి సరైన బ్యాలెన్స్ ఉంటే సిక్ లీవ్స్ తగ్గి ఇది యజమానులకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చట్టాలు చాలా అవసరమంటున్నారు. ఇలాంటి చట్టం భారత్ లోనూ ఉంటే ఎంతో బాగుంటుందని భారతీయులు భావిస్తున్నారు.