Ma:
ఇరవై ఏండ్లు… ఏడు ఎన్నికలు… ఒకటే పార్టీ.. ఒకడే అభ్యర్థి.. ఎదురు నిలవలేక ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు మారినా.. ఆయన విజయ ప్రస్థానానికి ఎక్కడా బ్రేక్ పడలేదు. కానీ, మొదటిసారి ప్రజాక్షేత్రంలో ఆయన గెలుపుపై భిన్నాభిప్రాయాలు. ప్రత్యర్థి నేతపై సానుకూలత ఓ వైపు, తనను కూలదోసేందుకు ప్రయత్నిస్తున్న సొంత పార్టీ నేతలు మరోవైపు.. అయినా ఎక్కడా తొణకకుండా ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తుందో గులాబీ గెలుపు గుర్రం.
రాష్ట్ర రాజకీయాలను శాసించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలకమైన ధర్మపురి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రత్యేకత సంతరించుకుంటోంది. ఇప్పటికే విడుదలైన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి వైపే గెలుపు మొగ్గు చూపిస్తున్నా.. తనతో లబ్ధి పొంది ఇప్పుడు పదవుల మోజుతో పక్క పార్టీకి సొంత నేతలు వెళ్లిపోతున్నా.. వెనకడుగు వేయకుండా గెలుపు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. స్థానికంగా వ్యతిరేకత అన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దాదాపు పద్నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న కొప్పులకు జనంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆ జనంపై నమ్మకంతోనే ఏడోసారి భారాసా అభ్యర్థిగా బరిలో దిగుతున్న కొప్పుల ఈశ్వర్ గెలుపు మరోసారి లాంఛనంగానే కనిపిస్తోంది.
* పద్నాలుగేళ్ల ప్రస్థానం ధర్మపురిదే..!
సింగరేణి ప్రాంతంలో కార్మిక ఉద్యమాల్లో కీలక భూమిక పోషించిన కొప్పుల ఈశ్వర్ 2001లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తదుపరి మూడేళ్లలో వచ్చిన సాధారణ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి భారీ ఆధిక్యంతో గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2008లో రాజీనామా చేసిన ఆయన.. అదే ఏట ఉప ఎన్నికల్లో జన మద్దతుతో మళ్లీ గెలిచారు. 2009లో సాధారణ ఎన్నికల్లో మరోసారి అదే స్థానం నుంచి విజయబావుటా ఎగరేశారు. 2010లో మరోసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి.. అదే ఏడాది వచ్చిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక్కడి ప్రజల ఆధరణతో అఖండ మెజారిటీతో గెలిచిన కొప్పుల.. వరసగా 2014, 2018 ఎన్నికల్లోనూ విజయ దుందుబీ మోగిస్తూ వస్తున్నారు. సింగరేణి కార్మిక నేతగా మొదలైన కొప్పుల ప్రస్థానాన్ని రాష్ట్ర స్థాయి కీలకనేతగా, రాజధాని నడిబొడ్డున అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహ సాక్షిగా బడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన్ను నిలబెట్టింది ధర్మపురి నియోజకవర్గమే.
90 శాతం లబ్ధిదారులు..
ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న రెండున్నర లక్షల ఓట్లలో దాదాపు ప్రతి ఇళ్లూ ఏదో ఒక సంక్షేమ పథకం లబ్ధి పొందుతోంది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు కలిసొచ్చి పూట గడుస్తున్న కుటుంబాల లెక్కా చాలా పెద్దదే. వీటికి తోడు గ్రామాల్లో వెలిసిన ఉద్యానవనాలు, కొత్త రోడ్లు, సెంట్రల్ లైటింగులు అభివృద్ధి ఛాయల్ని చూపిస్తున్నాయి. ఇవే నియోజకవర్గంలో కొప్పులను ఎదురులేని నాయకుడిగా నిలబెడుతున్నాయి. ఈసారి ఎన్నికల్లోనూ కలిసిరానున్నాయి.
ప్రచారంలోనూ ధీటుగా..
ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ కాస్త ఆలస్యంగా మొదలుపెట్టినా.. రాష్ట్రవ్యాప్తంగా భారాసపై ఓ నెగెటివ్ వేవ్ సృష్టించడంలో సఫలమైందనే చెప్పాలి. ధర్మపురి నియోజకవర్గ పరిధిలోనూ ఈ వేవ్ కనిపిస్తున్నా.. దానికి ధీటుగా భారాస అభ్యర్థి కొప్పుల ప్రచారం సాగుతోంది. సొంతపార్టీ నేతలు పెద్ద ఎత్తున పక్కపార్టీకి వలసలు కడుతున్నా.. జనానికి మరింత దగ్గరయ్యేందుకు కొప్పుల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గడపగడప కార్యక్రమాన్ని తుదిదశకు తీసుకురావడంతో పాటు కులసంఘాలను ప్రసన్నం చేసుకోవడంలోనూ సఫలమయ్యారు. నియోజకవర్గంలో చాలాగ్రామాలు, కుల సంఘాలు మరోసారి కొప్పులకే ఓటేస్తామని తీర్మాణాలు చేస్తున్నారు.