మన ఈనాడు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా చల్లారనే లేదు.. గెలుపోటములపై గ్రామాల్లో చర్చలింకా ఆగనే లేదు.. కొత్త సెగలు రేగుతున్నాయ్.. ప్రధాన పార్టీలు మరోసారి పందెంకోళ్లలా కాలు దువ్వుతున్నాయ్.. గెలిచినోళ్లు గెలుపు నిలబెట్టుకునేందుకు.. ఓడినోళ్లు పరువు నిలబెట్టుకునేందుకూ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు అంతటా ఆసక్తి రేకెత్తిస్తోంది.
గత ఎన్నికల్లో నాలుగు సీట్లతో సంచలనం సృష్టించిన భాజపా ఈసారి ఆ సంఖ్యను పెంచుకునేందుకు పావులు కదుపుతుండగా.. రాష్ట్రంలో గెలిచిన ఊపుతోనే ఎంపీ సీట్లలోనూ ఆధిక్యం తెచ్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఇరు పార్టీలు క్షేత్రస్థాయి సర్వేలు, అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతుండగా.. తాజామాజీగా మారిన భారాస ఆ రెండు పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే 17 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను దింపేందుకు పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పథకం రచిస్తున్నారు. సిట్టింగ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించగా, అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులు ఇప్పుడూ చేయకుండా అభ్యర్థులను మార్చే యోచనలో అధిష్టానం కనిపిస్తోంది. ఈ దిశగా కేటీఆర్ చక్రం తిప్పుతున్నారని పార్టీకి చెందిన కీలక నేతలు చెబుతున్నారు.
* ఖమ్మం తప్ప.. అందరికీ చెక్!
గత ఎన్నికల్లో లోక్‌సభ 17 స్థానాలకు గానూ భారతీయ రాష్ట్ర సమితి (అప్పటి తెరాస) 9, భాజపా 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాలను దక్కించుకున్నాయి. ఈసారి భారాసకు ఉన్న 9 సిట్టింగ్ స్థానాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానంతో పాటు మిగతా స్థానాల్లోనూ వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ నేతలను మార్చేందుకు భారాస కసరత్తు చేస్తోంది. ఖమ్మంలో నామా, మహబూబాబాద్ లో మాలోత్ కవితకు అసెంబ్లీ ఎన్నికలకు ముందే హామీ ఇవ్వడంతో ఇవి మినహాయించి మిగతా అన్ని స్థానాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
పెద్దపెల్లి నుంచి వెంకటేశ్ నేతకు స్థానికంగా ప్రజాధరణ లేకపోవడంతో పాటు గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా నియోజకవర్గం వైపు చూడలేదని నివేదికల్లో తేలడంతో అక్కడ ధర్మపురి స్థానం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో 80శాతం సింగరేణి బెల్టు ఉండటంతో పాటు ఈశ్వర్ సింగరేణి నాయకునిగా ఉండటం అందరికీ సుపరిచితుడు అవడం, ధర్మపురి బెల్టులో సానుభూతి కలిసొస్తుందని అధిష్టానం భావిస్తోందని సమాచారం.
చేవెళ్ల పరిధిలో భాజపా ఓటుబ్యాంకు గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఈసారి గెలుపు అవకాశాలు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కనిపిస్తుండగా.. ఈ స్థానంలో మరింత బలమైన నాయకున్ని దింపేందుకు భారాస యోచిస్తోంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి స్థానం కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. పట్నం మహేందర్ రెడ్డి, తీగల, మేడ్చల్ జడ్పీ ఛైర్మన్ తండ్రి సుధీర్ రెడ్డి రేసులో ఉన్నారు.
మహబూబ్‌నగర్‌లో సిట్టింగ్ మన్నె శ్రీనివాస్ రెడ్డిని కాదని ఈసారి సీటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఇవ్వనున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్, జహీరాబాద్ స్థానాల నుంచి గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన ఇద్దరు యువ నేతలకు సీటు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
వరంగల్ ఎంపీ స్థానం నుంచి మంద కృష్ణ మాదిగను పోటీకి దించేందుకు భాజపా యోచిస్తుండటంతో ఆ స్థానంలో పసునూరి కి బదులు మాదిగ సామాజికవర్గం నుంచి మరొక బలమైన నేతను దింపేందుకు భారాస చూస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆ దిశగా మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.
- SharanyaS