హైదరాబాద్: తెలంగణాలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంపై గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అరేబియా సముద్రంపై గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి కారణంగా రాష్ట్రంలో వచ్చే పది రోజులు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉదయం, రాత్రి సమయాల్లో 19 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
అదే మధ్యాహ్నసమయంలో 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం అయింది. దీని ప్రభావంతో అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 9 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. దాదాపు రెండు వారాలు ఆలస్యంగా రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. జూన్ మొదటి వారంలో కురవాల్సిన వర్షాలు .. జూన్ 20 తర్వాత అడపాదడపా కురిశాయి. ఆ తర్వాత జులై చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ములుగు జిల్లాలో వరదల కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత ఆగస్టులో మళ్లీ వరుణుడు ముఖం చాటేశాడు. సెప్టెంబర్ నెలలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలో చెదురుమొదురుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది.