Mana Enadu: తెలుగు రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు వర్షాలు(Rains) కాస్త తగ్గినా వరద ప్రభావం(Floods) మాత్రం తగ్గలేదు. పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల వల్ల మొత్తం 19 మంది మరణించినట్లు అధికారిక సమాచారం. వీరిలో NTR జిల్లాలో ఎనిమిది మంది మరణించగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిగిలిన వారు మరణించారు. అటు తెలంగాణలో వరదల వల్ల 12 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో పలువురు వరదల్లో గల్లంతైనట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు(Officials) వివరించారు. విజయవాడ నగరం వరుసగా రెండో రోజు కూడా నీటిలోనే ఉంది. బుడమేరు వరద ఈ నగరాన్ని అతలాకుతలం చేసింది.
రెండు రాష్ట్రాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు
AP, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే 31 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. గుప్పెడు మెతుకుల కోసం కన్నీరు పెడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. విజయవాడలోని చాలా కాలనీల్లో ఒక అడుగు నుంచి నాలుగు అడుగుల వరకు నీరు నిలిచిపోయింది. అనేక ప్రభుత్వ శాఖలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. సింగ్ నగర్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. పలుచోట్ల ఆహారం, ఇతర అత్యవసర పదార్థాలను బోట్లు, ట్రాక్టర్ల ద్వారా సిబ్బంది అందిస్తున్నారు. చాలా మంది ఆ వాన నీటిలోనే నానుతూ, వరద ప్రభావం లేని ప్రాంతాల్లోని తమకు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేశారు. కృష్ణా, GNT జిల్లాల్లోని పలు ప్రదేశాల్లో ప్రవాహంలో ఇరుక్కున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి. విజయవాడలో వరద ముంపు ప్రాంతం నుంచి ఓ పసికందును NDRF సిబ్బంది సహసోపేతంగా రక్షించారు. అటు Telangana లోని మహబూబాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కేసముద్రం- ఇంటకన్నెలను కలిపే ఇంటకన్నె రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఖమ్మంలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో రెండు తెలుగురాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు దగ్గర ఒక కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ వారిని కాపాడలేకపోయారు.
ఆదుకుంటాం.. అప్రమత్తంగా ఉండండి: కేంద్రం
తెలంగాణ CM రేవంత్ రెడ్డి HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వర్షాలపై సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అటు వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో PM నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అటు ఏపీలో విజయవాడలో గత రెండు రోజులుగా సీఎం చంద్రబాబు అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాధితులతో మాట్లాడి భరోసానిస్తున్నారు.