ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains in Telugu) అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ చాలా పల్లెలు, పట్టణాలు వరద ముంపులోనే ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగి అలుగు పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉప్పొంగిన వాగులు రహదారులపైకి చేరి పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కీలక రహదారి అయిన హైదరాబాద్ విజయవాడ (Vijayawada Hyderabad High Way) మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అయితే భారీ వరదలతో హైదరాబాద్- విజయవాడ హైవే (Hyderabad Vijayawda National High Way)లో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను తాజాగా అధికారులు పునరుద్ధరించారు. దాదాపు 30గంటల తర్వాత ఎన్‌హెచ్-65పై వాహనాల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కొత్త బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. అయితే వాహనదారులు బ్రిడ్జిపై నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల(Rain Alert in AP) మధ్య రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా నందిగామ మండలంలో మున్నేరు వరద తగ్గడంతో పోలీసులు ఐతవరం వద్ద వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారు.
విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద వరద ప్రవహిస్తుండటంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోలీసులు.. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వాహనంలో ఎక్కి వరద దాటారు. గత మూడు రోజులుగా మైలవరం నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే.. తన స్వగ్రామం ఐతవరం గ్రామాన్ని సందర్శించారు. మధ్యలో వరద ఉండటంతో హైడ్రా వాహనంలో ఎక్కి బయటకు వచ్చారు.