ManaEnadu:టాలీవుడ్ యంగ్ నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట వివాహ ముహూర్తం, వేదిక ఫిక్స్ అయ్యాయి. కర్ణాటకలోని కూర్గ్ లో ఆగస్టు 22వ తేదీన వీరి పెళ్లి వేడుక జరగనున్నట్లు సమాచారం. నటి రహస్య సన్నిహితులు, బంధువులంతా అక్కడే ఉండటంతో వివాహం అక్కడే జరగనున్నట్లు తెలిసింది.
‘రాజావారు రాణీగారు’, ‘ SR కల్యాణ మండపం’ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో పాపులరైన యాక్టర్ కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా కోస్టార్ అయిన రహస్య గోరక్ తో ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్ల పాటు ఈ జంట ప్రేమలో ఉండగా ఇటీవల నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కిరణ్ తన సోషల్ మీడియాలో పెళ్లి ముచ్చట్లు షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ముహూర్తం, వేదిక ఎక్కడో చెప్పేశాడు.
కర్ణాటకలో కూర్గ్‌లో ఆగస్టు 22న వీళ్ల పెళ్లి వేడుక జరగనున్నట్లు చెప్పిన కిరణ్.. ఆ తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు, సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఇప్పటికే పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమైనట్లు చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. క్యూట్ పెయిర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. 2019లో వచ్చిన ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్ లో బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఎస్సార్ కళ్యాణమండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ సినిమాలు ఈ నటుడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రసుత్తం ‘క’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు కిరణ్. మరోవైపు రహస్య గోరక్ కూడా షార్ట్ ఫిల్మ్స్ తోన తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ భామ కూడా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది.
‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ లో కలిసిన ఈ జంట ఆ సమయంలో ప్రేమలో పడ్డారట. గతంలో వీళ్లిద్దరి రిలేషన్ పై రూమర్స్ వచ్చినా వాటిపై ఈ ఇద్దరూ అధికారికంగా స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇటీవల సడెన్ గా తన గర్ల్ ఫ్రెండ్ రహస్య వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చాడు కిరణ్. కొన్నేళ్లుగా తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో మరింత పదిలం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.






