ManaEnadu:’రావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటీ?.. రానానుకున్నారా? రాలేననుకున్నారా?……… ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది’…….. ‘వీరశంకర్రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’……… ఈ డైలాగులు వింటే ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామో ఇప్పటికే మీకర్థమై పోయుంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలో మొదటి 5 స్థానాల్లో కచ్చితంగా ఉండే చిత్రం ‘ఇంద్ర’. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలంటే కేవలం బాలకృష్ణ మాత్రమే తీయగలరనుకున్న ప్రేక్షకులు.. మొదటి సారి ఫ్యాక్షనిస్టు పాత్రలో చిరంజీవిని చూసి ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీని జెన్-జీ కిడ్స్ కూడా బిగ్ స్క్రీన్ పై చూసి ఆనందించేలా.. 90స్ కిడ్స్ మరోసారి ఆ అనుభూతిని పొందేందుకు నిర్మాతలు రీ రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర మూవీ రీరిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడు పోయాయి. ఈ నేపథ్యంలో తన సినిమా రీ రిలీజ్ పై మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.
‘‘ఇంద్రసేనా రెడ్డి.. అని అంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ సినిమాకు ఉన్న పవర్ అలాంటిది. ‘ఇంద్ర’ అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఆ చిత్ర కథ. అలాగే ఆ మూవీ కోసం పని చేసిన వారు. వారంతా మనసు పెట్టి శ్రద్ధగా వర్క్ చేశారు కాబట్టే ఇప్పటికీ ప్రతి ప్రేక్షకుడు ‘ఇంద్ర’కు సంబంధించిన ప్రతీ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఆ సినిమాలో ఏ సీన్ నుంచి చూడడం మొదలుపెట్టినా చివరిదాకా చూస్తాం. అదే ఆ కథకు ఉన్న గొప్పతనం. నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ‘ఇంద్ర’. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కథ, స్క్రీన్‌ప్లే, ఆర్టిస్టుల నటన, పాటలు.. అన్నీ అద్భుతం’’
‘‘ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి కచ్చితమైన ఉదాహరణ ‘ఇంద్ర’. డైరెక్టర్ బి.గోపాల్ దీన్ని గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు. 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రీరిలీజ్ కావడం సంతోషంగా ఉంది. 2002 జులై 22 ‘ఇంద్ర’ రిలీజ్ సందర్భంగా ఎలాంటి భావోద్వేగానికి గురయ్యానో.. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ తోనే ఉన్నాను. ఈతరం వాళ్లకు దీన్ని బిగ్ స్క్రీన్‌పై చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నదత్, ప్రియాంక దత్‌లకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ ఎంజాయ్ చేయండి’ అని చిరు తన వీడియోలో చెప్పారు.