HOME LOAN: ఈఎంఐ భారంగా మారిందా?

Mana Enadu:సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకొనే వారిలో చాలామంది హోంలోన్ తీసుకుంటారు. అయితే కొందరు నెలనెలా ఈఎంఐలు కట్టడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. 20-30 ఏళ్లవరకూ ప్రతి నెలా ఇంత మొత్తం కట్టాలంటే కాస్త ఇబ్బందనే చెప్పాలి. అయితే ఈఎంఐ తగ్గించుకొనేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే..

ఎంక్వైరీ
హోంలోన్ తీసుకునే ముందు అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఎంత వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోండి. వాటిలో ఏది తక్కువకు ఇస్తుందో చూసి లోన్ తీసుకోండి.

 క్రెడిట్ స్కోరు
లోన్ అప్లై చెయ్యగానే బ్యాంకులు ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్. ఇది ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు అంత తక్కువగా ఆఫర్ చేస్తుంటాయి బ్యాంకులు. కాబట్టి మీరు తీసుకున్న లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇతర పేమెంట్లు ఏమున్నా కచ్చితంగా చెల్లించాలి. క్రెడిట్ స్కోరును బేస్ చేసుకొని ఈఎంఐ తగ్గించే అవకాశం ఉందేమో బ్యాంకులను అడగాలి.

 టెన్యూర్
లోన్ టెన్యూర్ ఎక్కువ కాలం సెలక్ట్ చేసుకుంటే ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ భారం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆదాయాన్ని బట్టి మీపై భారం పడకుండా ఉండేలా ఈఎంఐను ఎంచుకోండి.

 డౌన్ పేమెంట్
ఈఎంఐ తక్కువగా ఉండాలంటే మీరు హోం లోన్ కోసం మొదట్లో ఎక్కువ డబ్బులు చెల్లించాలి. మీ వద్ద డబ్బులుంటే లోన్‌లో ఎక్కువ మొత్తాన్ని ముందుగానే చెల్లించండి. అలాగే ఎప్పుడైనా డబ్బులు అందినప్పుడు ఈఎంఐ భారంగా ఉంది అనుకుంటే లోన్‌లో కొంత మొత్తాన్ని ముందుగానే చెల్లించవచ్చు. ఈఎంఐ భారంతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది. అయితే బ్యాంకులో ప్రీ క్లోజర్ ఛార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ముందడుగు వెయ్యాలి.

ఆఫర్లు
కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పండుగ సీజన్‌లో లేదా మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ ఆఫర్లు అందిస్తుంటాయి. ఈ సమయంలో సాధారణ వడ్డీ రేట్ల కంటే ఇంకా తక్కువ రేటుకే హోంలోన్లు మంజూరు చేస్తుంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకోవాలి.

వేరే బ్యాంకు
ఒక బ్యాంకులో హోం లోన్ తీసుకున్న తర్వాత, వేరే బ్యాంకులేవైనా తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తామంటే వెంటనే దానికి మారిపోండి. అప్పుడు మీపై అదనపు భారం తగ్గుతుంది. వడ్డీ కూడా తక్కువ పడుతుంది. కాకపోతే ట్రాన్స్‌ఫర్ ఛార్జీల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం.

 ప్రీ అప్రూవ్డ్‌ హోమ్‌ లోన్‌

ప్రీ అప్రూవ్డ్‌ లోన్ అనేది రుణగ్రహీత ఆదాయం, క్రెడిట్ యోగ్యత, ఆర్థిక స్థితి ఆధారంగా బ్యాంకులు మంజూరు చేసే షరతులతో కూడిన లోన్‌. ప్రీ-అప్రూవ్డ్ హోమ్ లోన్‌లు సాధారణంగా 3-6 నెలల వరకు చెల్లుబాటు అవుతాయి. అంటే రుణగ్రహీత ఆస్తిని కనుగొనడం, రుణాన్ని మూసివేయడం, దానిని పంపిణీ చేయడం ఈ సమయం లోపే చేయాలి. రుణగ్రహీత ఈ కాల వ్యవధిలో ఆస్తిని కనుగొనలేకపోతే వారు తమ ముందస్తు ఆమోదాన్ని పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ పాలసీ ప్రకారం చెల్లుబాటు మారే అవకాశం ఉంటుంది.

Share post:

లేటెస్ట్