కఠిన విజిటర్ పాలసీ.. రాత్రివేళ టైట్ సెక్యూరిటీ.. వైద్యుల భద్రతపై కేంద్రం సూచనలు

ManaEnadu:పశ్చిమ బెంగాల్​లోని కోల్​కతా ఆర్​జీ కార్ ఆస్పత్రి (Kolkata RG Kar Hospital Incident)లో జూనియర్ డాక్టర్​పై హత్యాచారం (Kolkata Doctor Rape Murder Case) జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పని ప్రదేశంలో మహిళల భద్రతకు సంబంధించి ఆందోళనలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా వైద్యుల భద్రతకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. రోగులు, ఇతరుల నుంచి తరచూ వైద్యులకు ముప్పు ఏర్పడుతున్న సంఘటనలు నిత్యం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) పనిప్రదేశాల్లో వైద్యుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ మేరకు సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు.. పని ప్రదేశంలో వైద్యుల భద్రతకు ప్రత్యేక ప్రోటోకాల్‌ ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. ఈ క్రమంలోనే వైద్యారోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజాగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు లేఖ రాశారు. వైద్యారోగ్య సిబ్బంది (Medical Staff)పై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు.

వైద్యుల భద్రతకై రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసిన సూచనలివే

ఆస్పత్రుల్లోని కీలక ప్రదేశాల్లో సాధారణ ప్రజలు, రోగుల బంధువుల కదలికలపై నియంత్రణ ఉంచాలి.
విజిటర్‌ పాస్‌ పాలసీ (Strict visitor Policy)ని కఠినంగా అమలు చేయాలి.
రాత్రి వేళల్లో రెసిడెంట్‌ డాక్టర్లు, నర్సులు సురక్షితంగా వెళ్లేలా సదుపాయాలు కల్పించాలి.
లైంగిక వేధింపుల (Sexual Harassment)పై విచారణ కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలి.
క్యాంపస్‌లోని ప్రతి మూలా సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా నిరంతరం పర్యవేక్షించాలి.
సీసీటీవి డేటాను భద్రపరచాలి.
జిల్లా ఆస్పత్రుల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలి.
పెద్ద ఆస్పత్రుల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నిరంతరం సీసీటీవీలను పర్యవేక్షించాలి.
ఆస్పత్రిని స్థానిక పోలీసు స్టేషన్‌కు అనుసంధానం చేయాలి.
బోధనాసుపత్రుల్లో నిరంతరం కలెక్టర్లు, ఎస్పీలు, ఆస్పత్రి యంత్రాంగం సంయుక్తంగా సెక్యూరిటీ ఆడిట్‌లను నిర్వహించాలి.
మౌలిక వసతుల కొరత, భద్రతపరమైన లోపాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

వీటితో పాటు ఆస్పత్రుల్లో హింసాత్మక ఘటనల నియంత్రణ వైద్యుల భద్రత కోసం అమలు చేయాల్సిన వ్యూహాల కోసం సీనియర్‌ వైద్యులు, పాలనాధికారులతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అంతే కాకుండా భద్రత కోసం నియమించుకున్న వారితో పాటు మిగతా సిబ్బందిని పర్యవేక్షించాలని తెలిపింది. కాంట్రాక్టు భద్రతా సిబ్బందికి తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు శిక్షణ ఇప్పించాలని సూచనలు జారీ చేసింది.

Share post:

లేటెస్ట్