Mana Enadu:భారతీయ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (52) ఆ తర్వాత ఫామ్ కోల్పోయి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చివరకు కెరీర్‌ను ముగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో సతమతమవుతున్నారు. తాజాగా వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో ఆయన కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఏం జరిగిందంటే..?
ఏదో పని మీద బయటికొచ్చిన వినోద్ కాంబ్లీ ఓ షాప్ ముందు ఉన్న బైక్‌ని పట్టుకుని నిల్చున్నాడు. ఆ షాప్‌లోకి వెళ్లడానికి అతడు సరిగ్గా నడవలేక ఇబ్బందిపడ్డాడు. గమనించిన స్థానికులు అతడి చేతులు పట్టుకుని నెమ్మదిగా షాప్‌లో కూర్చోబెట్టారు. ఈ వీడియో ఇప్పటిదా? పాతదా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మాజీ క్రికెటర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధగా ఉందంటూ వాపోతున్నారు.
వినోద్ కాంబ్లీ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బీసీసీఐ ఇచ్చే పింఛనుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నానని గతంలో కాంబ్లీ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో అతడి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ .. తన మిత్రుడు అయిన కాంబ్లీకి సాయం చేయాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.
1988లో పాఠశాల స్థాయి క్రికెట్‌లో సచిన్-కాంబ్లీ జోడీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఇక హారిస్ షీల్డ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి 664 (కాంబ్లి 349, సచిన్ 326) పరుగులు చేశారు. 1990ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కాంబ్లీ ఆరంభంలో తన సత్తా చాటి ఆ తర్వాత ఫామ్ కోల్పోయారు. ఇక వచ్చిన ఛాన్సులను కూడా సరిగ్గా వినియోగించుకోలేక కెరీర్ కు ది ఎండ్ పలకాల్సి వచ్చింది.