ManaEnadu:పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ (Kolkata RG Kar Hospital) ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఈ ఘటనకు వ్యతిరేకంగా జూనియర్ వైద్యులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.
రాజీనామాకు సిద్ధం
ఈ నేపథ్యంలో జూనియర్ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ఆ రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
లైవ్ స్ట్రీమింగ్ కుదరదు
ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలి (Kolkata Doctor Rape Murder)కి న్యాయం చేయాలని దీదీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం రోజున దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని తెలిపారు. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటం వల్ల జూనియర్ వైద్యులు డిమాండ్ చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని చెప్పారు.
వీడియో రికార్డింగ్ ఓకే
అయితే.. ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాటు చేశామని మమతా బెనర్జీ వెల్లడించారు. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తామని తెలిపారు. చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు యత్నించానని పేర్కొన్నారు. నెల రోజులుగా వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని దీదీ ఆవేదన వ్యక్తం చేశారు. 27 మంది మృతి చెందారని తెలిపారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల (Junior Doctors)పై ఎలాంటి చర్యలు తీసుకోనని స్పష్టం చేశారు.
మరోవైపు వైద్యులు మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్, ఆరోగ్య కార్యదర్శి, హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్‌లను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు.