కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. దిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌

ManaEnadu:దిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Excise Policy Case) వ్యవహారంలో సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ కేసులో గతంలోనే కేజ్రీవాల్‌ (CM Kejriwal)కు బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం.. అరెస్టు చట్టబద్ధత కాదా అనే విషయంలో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. సుదీర్ఘ జైలు శిక్ష వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతుందని తెలిపింది. . ప్రతి వ్యక్తికి ‘బెయిల్ అనేది నిబంధన- జైలు మినహాయింపు’గా ఉండాలి అని పునరుద్ఘాటించింది.

ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

కేసుకు సంబంధించి వ్యాఖ్యలు చేయవద్దని కేజ్రీవాల్‌కు షరతు విధించిన సుప్రీంకోర్టు (Supreme Court) సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని కండిషన్ పెట్టింది. అధికారిక దస్త్రాలపై సంతకాలు చేయవద్దని ఆదేశించింది. రూ.10 లక్షలకు బాండ్లు, ఇద్దరి పూచీకత్తుతో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టు సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని, ఈడీ కేసు (ED Case)లో బెయిల్‌ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సమంజసం కాదని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దిల్లీ మద్యం కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్‌ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిహాడ్‌ జైలు (Tihar Jail)లో ఉన్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహాడ్‌ జైలు నుంచి బయటకు రానున్నారు.

ఇంతకు మించిన పాపం లేదు

కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా (Manish Sisodia) స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న ఆయన ఇవాళ న్యాయమే గెలిచిందని వ్యాఖ్యానించారు. ప్రజా సేవలో ఉన్న సీఎంను జైలులో పెట్టారని, ఇంతకు మించిన పాపం ప్రజాస్వామ్యంలో జరగలేదని విమర్శించారు. రాజ్యాంగం, అంబేడ్కర్‌కు ధన్యవాదాలు చెబుతున్నామని తెలిపారు.

న్యాయం గెలిచినందుకు సంతోషం

“అవినీతి చేశారనో? తప్పు చేశారనో? కేజ్రీవాల్‌ను అరెస్టు చేయలేదు. కేజ్రీవాల్‌ను జైలులో పెడితే పార్టీ ముక్కలవుతుందనుకున్నారు. ఆప్‌ ప్రభుత్వం (AAP Govt) కూలేందుకు కుట్ర చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది. ఎంత ఇబ్బంది పెట్టినా ఆప్‌ నేతలు ధైర్యంగా ఉన్నారు. సంక్షోభ పరిస్థితుల్లో ఆప్‌ కార్యకర్తలు అండగా నిలిచారు. కుతంత్రాలతో ఆప్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ యత్నించింది. కేజ్రీవాల్‌ ఏ మాత్రం బెదరలేదు.. న్యాయం వైపే ఉన్నారు. న్యాయం గెలిచినందుకు సంతోషంగా ఉంది”. అని మనీశ్ సిసోదియా పేర్కొన్నారు.

Share post:

లేటెస్ట్