ManaEnadu:మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన (Shivaji Statue Collapse) ఘటన పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే (CM Eknath Shinde) ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇక ఈ ఘటనపై తాజాగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా క్షమాపణలు తెలియజేశారు. ఈ రోజు మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.
శివాజీ కంటే గొప్పదేం లేదు..
“నేను మహారాష్ట్ర గడ్డపై దిగిన వెంటనే శివాజీ మహరాజ్ కు నా క్షమాపణలు చెప్పాను. శివాజీ విగ్రహం కూలడం విచారకరం. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి శిరస్సు వంచి క్షమాపణలు చెబుతున్నాను. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారు. వారికి నా తలవంచి క్షమాపణలు చెబుతున్నా. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదు’’ అని మోదీ (PM Modi) క్షమాపణలు చెప్పారు.
ఇదీ జరిగింది..
మహారాష్ట్రలో కొద్దిరోజుల క్రితం ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్ప కూలిపోయింది. 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4వ తేదీన నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇటీవల భారీ ఎత్తున వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వానల కారణంగానే విగ్రహం (Maharashtra Statue Collapse) కూలినట్లు భావిస్తున్నామని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.








