మరికొన్ని గంటల్లో ట్రంప్, హారిస్ డిబేట్.. మాటల యుద్ధంలో గెలుపెవరిదో?

ManaEnadu:అమెరికా అధ్యక్ష ఎన్నికల (US Presidential Elections 2024)కు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రాట్, రిపబ్లిక్ అభ్యర్థులు కమలా హ్యారిస్ (Kamala Harris), డొనాల్డ్ ట్రంప్​ల మధ్య ప్రచారం హోరెత్తుతోంది. ఇరు పక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచారంలో జోష్ పెంచాయి. అగ్రనేతల ప్రచారంతో అమెరికా వీధులు మార్మోగుతున్నాయి. మరోవైపు కమలా, ట్రంప్​ల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య తొలి ప్రత్యక్ష డిబేట్​కు రంగం సిద్ధం అవుతోంది.

మరికొన్ని గంటల్లో ఈ డిబేట్​ మొదలు కాబోతోంది. అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్‌ ఫిలడెల్ఫియాలోని నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్‌ సెంటర్‌లో ఆ దేశ కాలమాన ప్రకారం రాత్రి 9.00 గంటలకు ఈ డిబేట్ (Trump Harris Debate) ప్రారంభం కానుంది. అయితే ఈ డిబేట్​ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు న్యూస్‌ స్టూడియోలో ప్రేక్షకులు ఉండరు. ఏబీసీ న్యూస్‌ యాంకర్లు డేవిడ్‌ ముయిర్, లిన్సే డేవిస్‌ చర్చకు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న ఈ సంవాదంలో 90 నిమిషాల పాటు చర్చ జరగనుంది. మధ్యలో రెండు సార్లు చిన్న బ్రేక్స్ ఉంటాయి. డిబేట్‌ చివరలో చెరో రెండు నిమిషాల పాటు ఈ ఇద్దరు అగ్రనేతలు ముగింపు ప్రసంగం చేస్తారు.

ఈ చర్చలో ఏబీసీ న్యూస్ మోడరేటర్లు ట్రంప్ (Donald Trump), హారిస్‌ను పన్ను తగ్గింపులు విదేశీ వ్యవహారాల గురించి తీవ్రమైన ప్రశ్నలు అడగనున్నట్లు సమాచారం. డిబేట్‌ను చూసే ప్రేక్షకులను ప్రత్యర్థులపై వేసే ఛలోక్తులు, విమర్శలే ఆకట్టుకుంటాయని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయన పాలసీ నిర్ణయాలపై చర్చించడంపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. ట్రంప్‌కు ఇప్పటివరకు ఆరుసార్లు డిబేట్‌లో పాల్గొన్న అనుభవం ఉండగా కమలా హారిస్‌కు ఇదే మొదటి చర్చ.

డెమోక్రాటిక్ అభ్యర్థిగా ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్‌ (Joe Biden) వైదొలిగిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో కమలా హారిస్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారానికి, డిబేట్ రిహార్సల్​కు ఆమెకు ఎక్కువ సమయం దరొకలేదు. తక్కువ సమయంలో ట్రంప్ వంటి వాక్పఠిమ కలిగిన వక్తను ఢీ కొట్టడం కమలా హారిస్ ముందున్న సవాల్ ఇప్పుడు. అయితే ట్రంప్‌లా కాకుండా హారిస్‌ గత వారమంతా పాలసీపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ డిబేట్‌లో ట్రంప్‌ వయసు పైబడిన వ్యక్తి, పాత కాల ఆలోచనలు అన్న పదాలను హారిస్‌ ఉపయోగించనున్నట్లు సమాచారం.

Share post:

లేటెస్ట్