పదేళ్లు పూర్తి చేసుకున్న జన్ ధన్.. ప్రధాని మోదీ స్పెషల్ పోస్టు

ManaEnadu:దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం ‘ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన’ (PM Jan Dhan Yojana). ఈ పథకం కింద ఎవరైనా జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవచ్చు. అనేక ప్రయోజనాలు కూడా పొందొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నింటికి అనుసంధానం అయ్యేలా ఈ పథకాన్ని 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశ ప్రజల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi Twee Today)  ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ పథకం విజయవంతం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి.. ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ పథకం అత్యంత ముఖ్యమైందని మోదీ (PM Modi On Jan Dhan Yojana) పేర్కొన్నారు. ఇది దేశ ప్రజల సాధికారత, దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో నడిపేందుకు ఎంతో ఉపయోగపడిందని వెల్లడించారు. 

దేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా (Bank Account) అయినా ఉండేటట్లు చూడటం జన్‌ధన్‌ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.  జన్‌ధన్‌ యోజన ప్రారంభించినప్పుడు.. దాని చుట్టూ ఉండే సమస్యలు, సందేహాలు తనకు ఇంకా గుర్తున్నాయని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకురావడం సాధ్యమవుతుందా..? అనే ప్రశ్నలు ఎదురయ్యాయని చెప్పారు. కానీ, ఈ ప్రయత్నం మంచి మార్పుకు దారి తీస్తుందని నమ్మానని వివరించారు.

“ఇప్పుడు దేశంలో 53 కోట్ల మందికి పైగా ప్రజలకు బ్యాంకు ఖాతాలున్నాయి.  ప్రస్తుతం ఈ ఖాతాల్లో డిపాజిట్ల బ్యాలెన్సు రూ. 2. 3 లక్షల కోట్లు. వీటిలో 65 శాతానికి పైగా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల వారున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 30 కోట్ల మందికి పైగా మహిళలు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చారు.” అని ప్రధాని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

Share post:

లేటెస్ట్