Mana Enadu: Indalwai Toll Plaza Got Gold Medal : రహదారుల నిర్వహణలో మెరుగుదల కోసం కేంద్రం టోల్‌ప్లాజాలకు పురస్కారాలు అందిస్తోంది. ఇందులో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా బంగారు పతకం సాధించింది. ‘ఎక్సలెన్స్ ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్-ఫ్లెక్సీబుల్’ విభాగంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడంతో ఈ అవార్డు దక్కింది. రహదారుల నిర్వహణ, రోడ్డు పక్కన, విభాగిని మధ్యలో మొక్కల పెంపకం, నిర్వహణ, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టడం వంటివి అంశాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తోంది.
నిర్వహణలో పోటీతత్వం తీసుకొచ్చేందుకు 2018 నుంచి ఏటా కేంద్రం అవార్డులు ఇస్తోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నిర్దేశించిన ఆరు అంశాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులకు బంగారు, వెండి పురస్కారాలు లభిస్తాయి. 2022 ఏడాదికి గానూ ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డును గత నెల 6న దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌సింగ్ అందుకున్నారు.