ManaEnadu:జార్ఖండ్ రాజకీయాల్లో (Jharkhand Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపాయీ సోరెన్ తాజాగా బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుల సమక్షంలో ఇవాళ (ఆగస్టు 30వ తేదీ) పార్టీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, బీజేపీ ఝార్ఖండ్ అధ్యక్షుడు బాబూ లాల్ మరాండీ సమక్షంలో చంపయీ సోరెన్ తన మద్దతుదారులతో కలిసి పార్టీలో చేరారు. కాషాయ పార్టీలోకి స్వాగతించిన తర్వాత సోరెన్ (Champai Soren) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చంపాయీ, కొంతకాలంగా ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. హేమంత్ సోరెన్ (Hemant Soren) జైలుకు వెళ్లిన సమయంలో చంపయీ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇక హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి చంపయీ వైదొలగడంతో సీఎం పగ్గాలు మళ్లీ హేమంత్ సోరెన్ చేతికి వెళ్లాయి. అయితే ఈ క్రమంలోనే సొంత పార్టీ అధినాయకత్వంపై చంపయీ అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఈ సంఘటనల తర్వాత ఆయన తన పార్టీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఆయన దిల్లీ (Delhi)కి వెళ్లడంతో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం వాటిపై స్పందించలేదు. ప్రస్తుతం తన ముందు మూడు మార్గాలు ఉన్నాయని వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటానని చెప్పారు. అందులో మొదటిది రాజకీయాల నుంచి నిష్క్రమించడం.. కానీ ఆయన ఇప్పట్లో రాజకీయాలను వదిలేది లేదని స్పష్టం చేశారు.
ఇక రెండోది.. వేరే పార్టీలో చేరడం అని, మూడోది కొత్త పార్టీ పెట్టి.. తనతో కలిసి వచ్చే మిత్రులతో ముందుకెళ్లడం అని చెప్పారు. అయితే వీటిలో ఆయన రెండో ఆప్షన్ ను ఎంచుకున్నారు. బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించడంతో చంపయీ సోరెన్ ఇవాళ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన రాక జార్ఖండ్ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని రాష్ట్ర నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections) ముందు చంపయీ చేరిక.. జార్ఖండ్ రాజకీయాల్లో కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.