ManaEnadu:త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపయీ సోరెన్ బీజేపీలో చేరతారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. అందుకే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, బీజేపీలో చేరికపై స్పష్టత ఇవ్వలేదు. కానీ తన ముందు మూడు మార్గాలున్నాయంటూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు.
పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాల్సి వచ్చిందని చంపయీ సోరెన్ తెలిపారు. ఈ రోజు నుంచి జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని ఇటీవలి శాసనసభా పక్ష సమావేశంలో చెప్పానని గుర్తు చేశారు. ప్రస్తుతం తన ముందు మూడు మార్గాలున్నాయని ఆయన చెప్పారు. అందులో ఒకటి.. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం అయితే.. రెండోది.. సొంతంగా పార్టీ పెట్టడం అని వెల్లడించారు. ఇక చివరగా.. ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయడం అని పేర్కొన్నారు. ఇప్పటినుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు తన ముందు ఈ మూడు మార్గాలున్నాయి అని చంపయీ సోరెన్ వివరించారు.
భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 31న అరెస్టు చేయగా.. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపాయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే, తనను సీఎం పదవి నుంచి తప్పించడంతో చంపయీ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.







