కొత్త పార్టీ ప్రకటించిన జార్ఖండ్ టైగర్ చంపయీ సోరెన్!

ManaEnadu:అసెంబ్లీ ఎన్నికల ముందు జార్ఖండ్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆ రాష్ట్రంలోని అధికార ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ (JMM)లో ఇటీవలే లుకలుకలు బయటపడ్డాయి.  ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పేరొందిన చంపయీ సోరెన్‌.. సొంత పార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ  ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఆ తర్వాత ఆయన దిల్లీ వెళ్లడంతో బీజేపీలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ తాజాగా చంపయీ సోరెన్ కీలక ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. 

తాను కొత్త పార్టీని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు జార్ఖండ్ టైగర్ చంపయీ సోరెన్. ఇప్పట్లో రాజకీయాలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన ముందు రిటైర్మెంట్, కొత్త పార్టీ ఏర్పాటు, వేరే పార్టీలో చేరడం అనే మూడు మార్గాలున్నాయని చంపయీ అన్నారు. అయితే ఇప్పట్లో రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎంతో మంది మద్దతుగా నిలుస్తున్నారని.. అందుకే తన లైఫ్ లో కొత్త చాప్టర్ మొదలు పెట్టనున్నానని తెలిపారు. ఓ కొత్త పార్టీ ప్రారంభించి దాన్ని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నానని వెల్లడించారు. అయితే తన ప్రయాణంలో ఎవరైనా కలిస్తే వారితో కలిసి ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చంపయీ కొత్త పార్టీ ప్రకటన, పొత్తుతో ముందుకెళ్తానని ఆయన చేసిన వ్యాఖ్యలతో జార్ఖండ్ రాజకీయం మరో మలుపు తిరగబోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Share post:

లేటెస్ట్