Kolkata Rape & Murder Case: బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదు.. దీదీ ప్రభుత్వంపై నడ్డా ఫైర్

Mana Enadu: కోల్‌కతా (Kolkata)లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య (Rape & Murder) ఘటనపై పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందుతులను కఠినంగా శిక్షించాలని, వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, విద్యార్థులు కదం తొక్కారు. ఆ రాష్ట్ర నలుదిక్కుల నుంచి పెద్దయెత్తున సెక్రటేరియట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో రెండ్రోజుల క్రితం కోల్‌కతా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిరసనకారులను కంట్రోల్ చేయలకపోయిన పోలీసులు వారిపై లాఠీఛార్జ్, భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మహిళల భద్రతపై దీదీ మౌనం సరికాదు: BJP

పశ్చిమ బెంగాల్ పరిస్థితులపై TMC అధినేత, సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) పూర్తిగా విఫలమయ్యారని నడ్డా దుయ్యబట్టారు. డాక్టర్‌పై అత్యాచారం కేసులో నిందితులను సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కోల్‌కతాలో పోలీసుల అత్యుత్సాహ చర్యల పట్ల ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనిచ్చే ప్రతి వ్యక్తికి కోపం తెప్పించేలా ఉన్నాయన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్, కోల్‌కతా పోలీసులు వ్యవహారిస్తున్న తీరు సరికాదని నడ్డా మండిపడ్డారు. బెంగాల్‌లో రేపిస్టులు, నేరస్థులకు సహాయం చేయడానికి ఇచ్చే విలువ, మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఇవ్వడం లేదని నడ్డా ఆరోపించారు. మరోవైపు పోలీసులు మాత్రం తాము తగ్గేదే లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నబానా వైపు వచ్చే అన్ని రోడ్లను దిగ్భంధించారు. ఒక్కరిని కూడా అటు వైపు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. నిరసనల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. కోల్‌కతాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి, భద్రతా లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌, పోలీసు కమిషనర్‌ వ్యవహారించిన తీరును సమర్థిస్తోంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో ఆగస్టు 9 రాత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం జరిగింది. కానీ తొలుత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అనంతరం ఇది హత్యాచారంగా తేలింది. దీనితో సివిక్‌ వాలంటీర్ అయిన సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఇది ఒక్కరు చేసిన హత్యాచారం కాదని, పలువురు కలిసి గ్యాంగ్ రేప్​ చేసినట్లు పోస్ట్​మార్టం రిపోర్ట్​లో తెలింది. మరోవైపు సాక్ష్యాధారాలను రూపుమాపే కుట్ర కూడా జరిగింది. ఘటనా స్థలంలో రినోవేషన్ చేయడం, కొంత మంది ఆందోళన చేస్తున్న పేరుతో, ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం లాంటివి జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించారు. ఆర్​జీ కర్ మాజీ ప్రిన్సిపల్​కు, నిందితుడు సంజయ్​ రాయ్​కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. అయితే సంజయ్ రాయ్​ మాత్రం ఈ పాలీగ్రాఫ్ టెస్ట్​లో పూర్తిగా అబద్ధాలు చెప్పినట్లు తెలుస్తోంది.

 

Share post:

లేటెస్ట్