Mana Enadu: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన BRS ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు(Suprem Court) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె దాదాపు 165 రోజుల పాటు తిహార్ జైలులో శిక్ష అనుభవించారు. అయితే తనను అక్రమంగా, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని కవిత మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టులో తన వాదనలు వినిపించారు కూడా. అయితే కిందిస్థాయి కోర్టులు ఆమె వాదనలు వినకపోవడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా పలు దఫాలుగా ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో మంగళవారం ఆమెకు దేశ ఉన్నత ధర్మాసనం కవితకు రూ.10 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్న రాత్రి 9.12 నిమిషాలకు ఆమె జైలు నుంచి బయటికి వచ్చారు.
బీఆర్ఎస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం కవిత హైదరాబాద్(Hyderabad)కు రానున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయల్దేరతారు. సాయంత్రం 5గంటల వరకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కవిత రాక సందర్భంగా అభిమానులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి.. తెలంగాణ భవన్‌కు కవిత చేరుకునే అవకాశం ఉంది. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో కవిత కేసీఆర్‌ను కలిసే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
జైలు నుంచి రాగానే వారికి వార్నింగ్
ఇదిలా ఉండగా.. బెయిల్‌పై విడుదలైన సమయంలో కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జైలు గేటు నుంచి బయటకు రాగానే కొడుకు, భర్తను హత్తుకున్నారు. తన అన్న, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను ఆత్మీయ ఆలింగనం చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె కన్నీళ్లు పెడుతూనే.. తనను ఇబ్బంది పెట్టిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్(Warning)ఇచ్చారు. తాను తెలంగాణ(Telangana)బిడ్డను.. కేసీఆర్(KCR) బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు.. 18ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదన్నారు. ఐదున్నర నెలలు కుటుంబానికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంత మంచిదానినో అంతే మొండిదానిని అన్నారు. ఇబ్బంది పెట్టిన వారు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని కవిత హెచ్చరించారు.