ManaEnadu:కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తర కొరియా డిక్టేటర్ గురించి తెలియని వారుండరు. ఈ దేశంలో నిబంధనలు.. వాటిని ఉల్లంఘిస్తే వేసే శిక్షలు చాలా వయోలెంట్. ఆధునిక ప్రపంచంలోనూ నేను మోనార్క్ ను నన్నెవ్వడూ మోసం చేయడు.. సీతయ్య.. నేనెవ్వడి మాటా వినను.. అనేలా పాలనలో తన రూటే సపరేటు అన్నట్టు నియంతగా వ్యవహరిస్తుంటాడు కిమ్. అయితే ప్రస్తుతం కిమ్ రాజ్యం మునిగిపోతోంది.
కిమ్ రాజ్యంపై ప్రకృతి ప్రకోపించింది. ఉత్తర కొరియాపై వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గతకొన్ని రోజుగా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు పోటెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల వరదలో మోకాళ్లోతు నీటిలో తన లగ్జరీ కారులో కూర్చుని ప్రయాణించి, పరిశీలించిన కిమ్.. ఇప్పుడు వరద ప్రాంతల్లో బోటుపై తిరుగుతూ పరిస్థితిని పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను అంతర్జాతీయ మీడియా టెలికాస్ట్ చేస్తోంది.
అయితే ఇలాంటి విపత్కర సమయంలో కిమ్ రాజ్యానికి ఊహించని వైపు నుంచి మానవతా సాయం ఆఫర్ వచ్చింది. అదెవరో కాదు.. ఉత్తర కొరియా ప్రకృతి ప్రకోపంతో విలవిల్లాడుతుంటే.. సాయానికి ముందుకొచ్చింది ఆ దేశ బద్ధశత్రువైన దక్షిణ కొరియా.
ఈ భారీ వర్షాలకు నదులు పొంగి వరదలు రావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారని అంటున్నారు. దీంతో.. ఈ సమయంలో కిమ్ కు ఊహించని రాజ్యం నుంచి మానవతాసాయం ఆఫర్ వచ్చింది. భీకర వరదలతో అతలాకుతలమైన ఉత్తరకొరియాకు మానవతా సాయం చేస్తామని, బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రి అందిస్తామని ప్రకటించింది సౌత్ కొరియా. అయితే వాటిని ఎలా సరఫరా చేయాలన్న దానిపై చర్చించేందుకు తక్షణమే స్పందించాలని ఉత్తరకొరియా రెడ్ క్రాస్ సంస్థను కోరింది. అయితే, సియోల్ ఆఫర్‌పై కిమ్ సర్కారు స్పందించకపోవడం గమనార్హం.
వర్షాల కారణంగా బుధవారం నాటికి 4100 ఇళ్లు ధ్వంసమవ్వడంతో పాటు 7,410 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టంపై కిమ్ సర్కారు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. విపత్తు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించినట్లు సమాచారం.