Mana Enadu: టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదేళ్ల క్రితం కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ వివాదంపై కేఎల్ రాహుల్ తాజాగా స్పందించాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత తనకు చాలా భయమేసిందని చెప్పాడు. ఈ షోలో టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ పాల్గొన్నాడు. అయితే అప్పుడు ఈ ఇద్దరూ కొన్ని అసభ్యకరమైన కొన్ని కామెంట్లు చేశారు. దీంతో సోషల్ మీడియా, బహిరంగంగా విమర్శలను ఎదుర్కొన్నారు. అటు బీసీసీఐ కూడా ఈ ఇద్దరు ప్లేయర్లపై నిషేధం కూడా విధించింది. అయితే, కొన్నాళ్లకు సస్పెన్షన్ ఎత్తేసింది. తాజాగా రాహుల్ నిఖిల్ కామత్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయంపై మాట్లాడాడు. తాను ఎప్పుడూ స్కూల్ నుంచే సస్పెండ్ అవలేదని, అలాంటిది జట్టు నుంచి నిషేధానికి గురయ్యే సరికి వణికిపోయానని అన్నాడు.
మొదటి నుంచి చాలా తక్కువగా మాట్లాడేవాడిని..
కాఫీ విత్ కరణ్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూ తనను మార్చేసిందని కేఎల్ రాహుల్ చెప్పాడు. “ఆ ఇంటర్వ్యూ చాలా విభిన్నం. అది నన్ను చాలా మార్చేసింది. నేను మొదటి నుంచి చాలా తక్కువగా మాట్లాడేవాడిని. సిగ్గు పడుతుండేవాడిని. ఇండియాకు ఆడిన తర్వాత నాకు చాలా ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎక్కువ మంది మధ్యలో ఉండేందుకు నాకు సమస్యగా అనిపించేది కాదు. గదిలో 100 మంది ఉన్నా నేను ఉన్నానని అందరూ గుర్తించేవారు. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడేవాడిని” అని రాహుల్ చెప్పాడు. కాగా ప్రస్తుతం రాహుల్ దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీకి రెడీ అవుతున్నాడు. ఈ టోర్నీ సెప్టెంబర్ 5న మొదలుకానుంది.
రాహుల్ క్రికెట్ కెరీర్ ఇలా..
కాగా కేఎల్ రాహుల్ టీమ్ఇండియా తరఫున 50 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 8 సెంచరీలు,14 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 2863 రన్స్ చేశాడు. వన్డేల్లో 77 మ్యాచులు ఆడిన ఈ ప్లేయర్ 7 సెంచరీలు, 18 అర్ధశతకాలతో 2851 పరుగులు సాధించాడు. ఇక టీ20ల్లో 72 మ్యాచుల్లో భారత్ తరఫున బరిలోకి దిగి రెండు సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్‌లోనూ రాహుల్ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఐపీఎల్‌లో నాలుగు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు మొత్తం 132 మ్యాచులు ఆడి 4683 రన్స్ చేశాడు.