ManaEnadu:దళపతిగా సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ‘తమిళగ వెట్రి కళగం ’ అనే పేరుతో ఆయన ఈ ఏడాది రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై అటూ, ఇటూ రెండు ఏనుగులు ఉన్నాయి. జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి విజయ్ ప్రతిజ్ఞ చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుంచి వెళ్లి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను ఎప్పటికీ గుర్తుంచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. కులం, మతం, లింగం, ప్రాంతం పేరుతో జరుగుతున్న వివక్షను తొలగిస్తామని.. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తామని ప్రతిన పూనారు. సమానత్వం అనే సూత్రాన్ని బలంగా సమర్థిస్తామని పేర్కొన్నారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ విజయ్ పార్టీ పెట్టడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పార్టీని ప్రారంభించిన విజయ్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఇతర పార్టీలకు కూడా మద్దతు ప్రకటించలేదు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీ జెండా, అజెండాను ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా? లేదా పొత్తులకు ముందుకొస్తారా? అనే దానిపై క్లారిటీ లేదు.






