మాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్టు రచ్చ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు రాజీనామా చేయాలన్న హీరో పృథ్వీరాజ్‌

ManaEnadu:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ రిపోర్టులోని వివరాలు బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ తమకు ఎదురైన అనుభవనాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రిపోర్టుపై, రిపోర్టు తర్వాత జరుగుతున్న పరిణామాలపై తాజాగా మలయాళీ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ స్పందించాడు.

కొచ్చిలో ఫుట్‌బాల్ క్లబ్ ‘ఫోర్కా కొచ్చి’ (ఎఫ్‌సి) ప్రారంభోత్సవంలో పాల్గొన్న పృథ్వీ రాజ్ సుకుమారన్.. విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. అధికారంలో ఉండి ఆరోపణలు ఎదర్కొంటున్న వారు వెంటనే పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నిందితులు దోషులని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

“హేమ కమిటీలో వెల్లడించిన అంశాలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే పరిశ్రమలో మహిళలకు సురక్షిత పని వాతావరణం కల్పించడం మన కనీస బాధ్యత. అందులో నేను ముందుంటా. కానీ అది నా ఒక్కడి బాధ్యత మాత్రమే కాదు. పరిశ్రమ మొత్తం ఆ పద్ధతిని అనుసరించాలి. అంతేకాదు జూనియర్‌ ఆర్టిస్టుల ఎంపికను క్రమబద్ధీకరించాలి’’ అని పృథ్వీరాజ్ తెలిపారు.

Share post:

లేటెస్ట్