మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. అరడజను మంది పరిశీలించి డిల్లీ రెండో జాబితాలో ఐదుగురి పేరు ప్రకటనకు అధిష్టానం సిద్దం అయింది.
పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి మరో నేత దానం నాగేందర్ కాంగ్రెస్ గూటికి రావడంతో సికింద్రాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి దానంను పోటీ చేయాలని పార్టీ భావవిస్తుంది. ఇప్పటికే డిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో నేడు ఆయన పేరు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో బొంతు స్థానం మారాల్సిన పరిస్థితి అనివార్యం అయింది.
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ముద్ర వేసుకున్న బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్లో కీలకంగా పనిచేశారు. బీజేపీ నుంచి మల్కాజ్గిరి అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ సైతం తెలంగాణ ఉద్యమ నాయకుడినే బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బొంతు రామ్మోహన్ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉండాలని ఇప్పటికే పార్టీ పెద్దల సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కంటే బొంతు రామ్మోహన్ బలమైన అభ్యర్థిగా ఈప్రాంతంలో ఉన్నాడు. గతంలోనే ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో తనకంటూ సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వీటితో కాంగ్రెస్ బలంతోపాటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బోంతు వైపు క్రాస్ అయ్యేలా చేయగలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నారు.