ManaEnadu:నెపోటిజం.. అదేనండి వారసత్వం (Nepotism).. కేవలం రాజకీయాల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ ఏళ్ల తరబడి నుంచి ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అనాదిగా స్టార్ నటుల వారసులు వెండితెరను ఏలుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలు ఇండస్ట్రీలోకి తమ సత్తాతోటి వచ్చారు. ఆ తర్వాత వారి వారసులుగా బాలకృష్ణ (Balakrishna), అక్కినేని నాగార్జున, వెంకటేశ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వారి వారసులుగా ఎన్టీఆర్, నాగ చైతన్య, అఖిల్, రానా, మహేశ్ బాబు వెండితెరపై సందడి చేస్తున్నారు. తాజాగా నాలుగో తరం వారసులు టాలీవుడ్‌ను ఏలేందుకు రెడీ అవుతున్నారు.
ఇటీవలే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ ఖాయమైంది. హను-మాన్ ఫేం ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక మోక్షజ్ఞతో పాటు మరికొందరు వారసులు తెలుగు తెరపై సందడి చేయడానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan), మాస్ మహారాజ రవితేజ తనయుడు మహానందన్ ఎంట్రీ కూడా త్వరలోనే ఉండనుందట. మరోవైపు పలువురు దర్శక, నిర్మాతల తనయుల ఎంట్రీ కూడా ఉండొచ్చని ఫిల్మ్ వర్గాల టాక్.
అయితే వీరందరిలో ఒకరి ఎంట్రీ మాత్రం పక్కాగా కన్ఫామ్ అయింది. స్వయంగా అతడి తండ్రి, టాలీవుడ్ హీరోనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హీరోనే సుధీర్ బాబు (Sudheer Babu). ఎంట్రీ ఇవ్వబోయేది ఆయన కుమారుడు చరిత్ మానస్. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో హీరో నాని చిన్ననాటి పాత్రలో నటించాడు చరిత్ మానస్. అప్పుడు చాలా చిన్నపిల్ల వాడు. కానీ ఇప్పుడు కుర్రాడైపోయాడు.
సినిమాల్లోకి రావాలని చరిత్ చాలా ఆసక్తిగా ఉన్నాడట. ఇటీవల సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ (Ma Nanna Super Hero) మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సుధీర్ బాబు తన కుమారుడు చరిత్ మానస్ ఎంట్రీని కన్ఫామ్ చేశారు.
“మరో నాలుగేళ్లలో చరిత్ (Charit Manas) ఎంట్రీ కచ్చితంగా ఉంటుంది. చరిత్‌కు సినిమాలంటే ఎంతో ఇష్టం. మేమంతా కొన్నాళ్లు ఆగమని చెబుతున్నా ఆగేలా లేడు. ఇప్పటికే యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. స్టంట్స్ చేసేందుకు చిన్నప్పటి నుంచే ట్రైన్ అవుతున్నాడు. టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు. నాలుగేళ్లలో వచ్చేస్తాడు.” అని సుధీర్ బాబు తెలిపారు. చరిత్ పోలికలు అచ్చం మేనమామ మహేశ్ బాబును పోలి ఉన్న సంగతి తెలిసిందే.