Mana Enadu:లోకం తెలియని పసి హృదయం ఉన్న ‘చంటి’ అయినా.. సవతి తల్లి అయినా కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించే ‘అబ్బాయిగారు’ అయినా.. తండ్రి మాట జవదాటిన బాను ప్రసాద్ (సూర్యవంశం) అయినా.. చెల్లి, తమ్ముళ్లకు కష్టం కాంపౌండ్ దాటకుండా చూసుకునే ‘లక్ష్మీ’ అయినా.. కుటుంబానికి ప్రాధాన్యమిస్తే ప్రతి రోజు ‘సంక్రాంతి’ అని చెప్పాలన్నా.. టాలీవుడ్లో ఒకే ఒక్కడు మన విక్టరీ వెంకటేశ్. కుటుంబ చిత్రాలతో సెంటిమెంట్ పండించాలన్నా.. డీసీపీ రామచంద్రలా విలన్లను రప్ఫాడించాలన్నా.. ఫన్, ఫ్రస్టేషన్ అంటూ ఎఫ్2, ఎఫ్3లో భార్యా బాధితుడిలా కామెడీ పంచాలన్నా వెంకీమామే. టాలీవుడ్లో దాదాపుగా అన్ని జానర్లు టచ్ చేసి ప్రతి జానర్లో హిట్ కొట్టిన హీరో విక్టరీ వెంకటేశ్. సింగిల్ హ్యాండ్ గణేశ్ అంటూ సింగిల్ టేక్‌లో సీన్స్ అన్నీ చేసేస్తూ.. దాదాపు 38 ఏళ్లుగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. మూవీ మొఘల్ రామా నాయుడు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. సొంత టాలెంట్ తో…తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు వెంకటేశ్. తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచాడు. ఆగష్టు 14 వెంకటేశ్ హీరోగా 38 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. 1986 ఆగష్టు 14న రిలీజైన ‘కలియుగ పాండవులు’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు.
వెంకటేశ్.. మన అమ్మానాన్నల తరం నుంచి నేటి తరానికీ ఫేవరెట్ హీరో. ఓపూట కుటుంబమంతా కలిసి టీవీ చూడాలంటే టీవీలో వెంకటేశ్ సినిమా రావాల్సిందే. అలా ఫ్యామిలీని ఒకచోట చేర్చి కాసేపు కలిసి సమయం గడిపేలా చేసింది వెంకటేశ్ సినిమాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈరోజుకు టీవీలో రాజా, కలిసుందాం రా, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలు వస్తే ఛానల్ మార్చకుండా చూస్తున్నారంటే వెంకీకి ఉన్న క్రేజ్ ఏంటో.. ఫ్యామిలీ ఆడియెన్స్‌పై ఆయన వేసిన ముద్ర ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్‌నే కాదు. వాసు, ఘర్షణ, నారప్ప, గురు, బాడీగార్డ్, మల్లీశ్వరి, నమో వేంకటేశ, వెంకీమామ ఇలాంటి ఎన్నో సినిమాల ద్వారా యూత్‌కు బాగా దగ్గరయ్యాడు వెంకటేశ్.అలా 38 ఏళ్లుగా టాలీవుడ్లో ఆయన సినీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. కలియుగ పాండవులు నుంచి మొన్నటి సైంధవ్ వరకు ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు అయినా.. వెంకీమామను ప్రేక్షకులు అలరిస్తూనే ఉన్నారు. ఆయన కూడా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూనే ఉన్నారు. మరో 30 ఏళ్లు ఆయన ప్రయాణం ఇలాగే కొనసాగాలని.. మనల్ని ఇలాగే ఆయన ఎంటర్టైన్ చేయాలని ఆశిద్దాం. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్‌కు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్ అదిరిపోయే సీడీపీ రెడీ చేసింది. అంతే కాదండోయ్ వెంకీ నటించిన సినిమాలోని కొన్ని క్లిప్స్‌తో అదిరిపోయే ఏవీ తయారు చేసింది. మరి మీరూ చూసేయండి.