ManaEnadu:పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. సలార్, కల్కి హిట్స్ జోరు మీదున్న ఈ రెబల్ స్టార్ తన నెక్స్ట్ హిట్స్ కోసం పని చేస్తున్నాడు. ఇప్పటికే సలార్-2, కల్కి-2, రాజా సాబ్, స్పిరిట్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్న డార్లింగ్ ఇటీవలే హను రాఘవపూడితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్-హను సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రభాస్ కూడా హాజరయ్యాడు. ఇక ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడీగా నటించబోతున్న యూట్యూబర్ ఇమాన్వీ ఇస్మాయిల్.
ప్రభాస్ తో సినిమా ప్రకటన రాగానే ఇమాన్వీ గురించి నెట్టింట వెతకడం ప్రారంభించారు అందరూ. ఎవరు ఈమె.. ఎక్కడి నుంచి వచ్చింది.. ప్రభాస్ కు జోడీగా ఎలా ఛాన్స్ వచ్చింది.. ఫస్ట్ సినిమాకే పాన్ ఇండియా స్టార్ తో నచించే ఛాన్స్ కొట్టేసిన భామ గురించి తెగ ఆరా తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇమాన్వీనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడంపై డైరెక్టర్ హను రాఘవపూడి స్పందించారు. హను తన హీరోయిన్ల విషయంలో పర్టిక్యులర్ గా ఉంటారు. తెరపై వాళ్లను చాలా కాన్ఫిడెంట్ గా హీరోకు దీటైన పాత్రలో చూపిస్తూనే.. వారిలోని ఫెమినైన్ యాంగిల్ ను చాలా సున్నితంగా ఆవిష్కరిస్తారు.
ఈ క్రమంలో హను రాఘవపూడి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఇమాన్వీలో ఆయన ఏం చూశారని అందరూ ఆలోచిస్తుండగా ఆయనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రభాస్ కు జోడీని ఈజీగా వెతికిపట్టుకున్నానని హను తెలిపారు. తమ స్టోరీ సెట్ అయ్యే నటులను సెలెక్ట్ చేసుకోవడంలో సోషల్ మీడియా ఫిల్మ్ మేకర్స్ కు బాగా యూజ్ అవుతోందని అన్నారు. అలాగే తాను కూడా తన హీరోయిన్ కోసం నెట్టింటనే వెతికానని చెప్పారు.
ఇమాన్వీని తాను సోషల్ మీడియాలోనే చూశానని.. ఆ తర్వాత ఆమె కంటెంట్ ను ఫాలో అయ్యానని చెప్పుకొచ్చారు హను రాఘవపూడి. ఇమాన్వీ అందం, ప్రతిభ కలిగిన అమ్మాయి అని పొగుడ్తూనే.. ఆమె మంచి భరతనాట్యం డ్యాన్సర్ అని తెలిపారు. కళ్లతోనే ఎన్నో హావభావాలను పలికిస్తుంటుందని.. అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నానని చెప్పారు. అయితే ఇమాన్వీకి ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత.. టీమ్ అంతా కలిసి నిర్ణయించిన తర్వాతే సెలెక్ట్ చేసినట్లు హను రాఘవపూడి క్లారిటీ ఇచ్చారు.