ManaEnadu:ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే అది అతిపెద్ద హైజాక్. 188 మంది ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు దాదాపు ఏడురోజుల పాటు ప్రయాణికులను బందీలుగా ఉంచారు. 1999లో జరిగిన ఈ హైజాక్ ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ గా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ సంఘటన ఆధారంగా ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది.
‘ఐసీ814:ది కాంధార్ హైజాక్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను థప్పడ్, ఆర్టికల్-15, ముల్క్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు అనుభవ్ సిన్హా రూపొందించారు. కెప్టెన్ దేవి శరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ‘ఫ్లైట్ ఇన్‌టూ ఫియర్ ’ ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఇవాళ విడుదల చేసింది. థ్రిల్లింగ్ అంశాలతో సీన్ సీన్ కు ఉత్కంఠ రేపుతున్న ఈ ట్రైలర్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
విమానాన్ని హైజాక్ చేసిన తర్వాత క్షణం నుంచి దిల్లీ వార్‌రూమ్‌లో జరిగిన ఘటనలను చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. ఫస్ట్ అమృత్‌సర్‌కి విమానాన్ని తీసుకెళ్లిన ఉగ్రవాదులు.. ఆ తర్వాత దాన్ని దుబాయ్‌కు అక్కడి నుంచి కాంధార్‌కు ఎందుకు తరలించారు? వారి డిమాండ్లు ఏంటి.. అందులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏంటి.. వంటి అంశాలతో ఆద్యంతం ఉత్కంఠగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ లో తెలిసిపోతుంది. ఆగస్టు 29వ తేదీ నుంచి ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.