NBK:’తాతమ్మ కల’కు 50 ఏళ్లు.. ఈ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

ManaEnadu:ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషిన్ ఇస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. బాలయ్య తొలి సినిమా తాతమ్మ కల. ఈ చిత్రం 1974లో ఆగస్టు 30వ తేదీన విడుదలైంది. పద్నాలుగేళ్ల వయసులోనే ఈ చిత్రంలో బాలకృష్ణ నటించారు. ఈ మూవీని ఆయన తండ్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆయన కూడా నటించారు. బాలనటుడిగా బాలకృష్ణకు ఇది తొలి సినిమా. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ తాతమ్మ కల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామా?

రెండు నెలలపాటు నిషేధం..

ఎన్టీర్ స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మ కల’ (Tatamma Kala) అప్పటి ప్రభుత్వ ఆలోచనా ధోరణికి భిన్నమైన కథాంశంతో రూపొందిందట. 1974లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ‘ఇద్దరు ముద్దు’ ఆపై వద్దు అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. అయితే అదే సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకోవడంతో రిలీజ్​కు ముందు ఎన్నో సవాళ్లెదురయ్యాయి. రెండు నెలలపాటు ఈ చిత్రం నిషేధానికి కూడా గురైందట.

సొంతంగా కథ రాసి..

అయితే ‘ఇద్దరు ముద్దు ఆపై వద్దు’ అనే ప్రభుత్వ నినాదానికి ఎన్టీఆర్‌ వ్యతిరేకి. ఎంత మంది పిల్లలను కనాలి అనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం కానీ.. ఇందులో వేరే వాళ్లకు ఎలాంటి హక్కు లేదని ఆయన చెప్పేవారు. అందుకే ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా.. తన ఆలోచనకు అనుగుణంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నారు ఎన్టీఆర్. అందుకోసం స్వయంగా ఆయనే కథ రాసి.. రచయిత డీవీ నరసరాజు (DV Narasaraju) సాయంతో శక్తిమంతమైన డైలాగ్స్​తో స్క్రిప్టు రెడీ చేశారు.

ఎన్టీఆర్​కు నంది అవార్డు..

ఈ చిత్రంలో రమణారెడ్డి, రోజారమణి (Roja Ramani), రాజబాబు, కాంచన కీలక పాత్రల్లో నటించారు. అప్పటి పరిస్థితుల వల్ల కథ పరంగా సెన్సార్‌ అడ్డంకులు బాగా ఎదురవ్వడంతో రెండు నెలల పాటు సినిమాపై నిషేధం విధించారు. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చలు జరిగినట్లు సమాచారం. ​పట్టుదలతో ఎన్టీఆర్ ఆ అడ్డంకులన్నీ దాటి 1974 ఆగస్టు 30న తాతమ్మ కల (Tatamma Kala Release) ను విడుదల చేశారు. ఈ మూవీ ఉత్తమ కథా రచయితగా ఎన్టీఆర్‌కు నంది అవార్డు (NTR Nandi Award) కూడా దక్కింది.

ఎన్టీఆర్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆయన డ్యూయెల్ రోల్ చేశారు. ఈ మూవీలో మనవడి పాత్రకు ఐదుగురు పిల్లలు పుడతారు. ఈ ఐదుగురు సమాజంలో రోజూ ఎదుర్కొంటున్న ఐదు ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపే ప్రతినిధులుగా నటిస్తారు. ఇందులో స్వర్గీయ నందమూరి హరికృష్ణ వ్యసనపరుడిగా నటించారు. ఇక బాలయ్య (Balakrishna) బాబు ‘తాతమ్మ కల’ నెరవేర్చే మునిమనవడిగా తన పాత్రతో ఆకట్టుకున్నారు.

తాతమ్మ కల సినిమా స్టోరీ ఇదే..

రావమ్మ (భానుమతి) ఊరి కోసం ఏదైనా చేయాలని తాపత్రయ పడే మహిళ. ఆమె కొడుకు, కోడలు చనిపోతారు. వారికి పుట్టిన బాబు (ఎన్టీఆర్)ను రావమ్మ పెంచుతుంది. అతడికి పెళ్లి చేయగా ఐదుగురు పిల్లలు జన్మిస్తారు. ఐదుగురు సంతానం.. ఖర్చులేమో బారెడు కావడంతో అప్పులు చేస్తాడు. కొంత భూమి అమ్మి అప్పులు తీరుస్తాడు. డబ్బు సంపాదన కోసం పట్నం వెళ్లి ఓ వ్యాపారి వద్ద గుమాస్తాగా చేరి తన పిల్లలను పోషించుకుంటాడు. ఇక హీరో ఐదుగురు పిల్లల పాత్రలను పరిచయం చేస్తూ అప్పటి సమాజంలోని ఐదు సమస్యలను వారితో ముడిపెడతాడు.

మొదటి కుమారుడు.. భార్య మాట విని తల్లితండ్రులను వదిలి వెళ్లిపోతాడు.
రెండో కుమారుడు.. మంచిబుద్ధి ఉన్నా చెడు స్నేహం వల్ల వ్యసనపరుడవుతాడు. ఈ పాత్రలో హరికృష్ణ నటించారు.
మూడో కుమారుడు.. వ్యసన పరుడు, దొంగ, అన్ని అవలక్షణాలున్నవాడు.
నాలుగో సంతానం.. అమాయకురాలు పట్నంలో కాలేజి విద్యార్దుల వల్ల మోసపోయి ఆత్మహ్యత్య చేసుకుంటుంది.
ఐదో కుమారుడు.. మంచి నాయకత్వ లక్షణాలుండి తాతమ్మ కల తీరుస్తాడు. ఈ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించారు.

Share post:

లేటెస్ట్