మహేశ్ బాబు వాయిస్​తో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’.. తెలుగు ట్రైలర్ అదిరిపోయింది

ManaEnadu:‘‘అప్పుడప్పుడు ఈ చల్లని గాలి.. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతుంది’’ అంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హాలీవుడ్ మూవీ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’లో ముఫాసా క్యారెక్టర్​కు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తెలుగు ట్రైలర్ విడుదలైంది. హాలీవుడ్‌ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ చిత్రంలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ ట్రైలర్​లో.. ‘మనం ఒక్కటిగా పోరాడాలి’, ‘నేనుండగా నీకేం కాదు టాకా.. భయపడకు’, ‘ఇందాకేదో అన్నావే..’ అంటూ మహేశ్ బాబు చెప్పిన డైలాగ్​లు ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన విజువల్స్‌తో మహేశ్‌ డైలాగ్స్‌తో ఈ ట్రైలర్‌ అదిరిపోయింది. ఇక ఇందులో మనం అలీ, బ్రహ్మానందం వాయిస్ కూడా వినొచ్చు. వారు కూడా పలు పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ఇక ‘ముఫాసా’కు వాయిస్‌ ఓవర్‌ అందించడంపై మహేశ్‌ ఆనందం వ్యక్తంచేశారు.

‘‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త చాప్టర్ ఇది. తెలుగులో ‘ముఫాసా’కు వాయిస్‌ అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది’’ అని మహేశ్ బాబు ముఫాసాకు డబ్బింగ్ చెప్పడంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ప్రపంచవ్యప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

మరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్‌ ఖాన్‌ డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన తనయుడు అబ్​రామ్, సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ‘‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. ఈ సినిమా కోసం నా పిల్లలతో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా అనిపిస్తుంది’’ అని షారుక్‌ ఇటీవలే తెలిపారు.

Share post:

లేటెస్ట్