రష్యాతో యుద్ధం వేళ.. ఉక్రెయిన్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?

ManaEnadu:గత రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ ల మధ్య భీకర యుద్ధం సాగుతూనే ఉంది. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి శాంతియుత చర్చలే మార్గమని యుద్ధంతో పరిష్కారాలు, సమస్యలకు పరిష్కారం దొరకదని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. జులైలో రష్యాలో పర్యటించిన మోదీ స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. అప్పుడు మోదీ-పుతిన్ ల భేటీపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే రష్యా దండయాత్రతో గత రెండేళ్లకు పైగా యుద్ధ భూమిలో నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో త్వరలోనే  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఇప్పటికే పలుమార్లు తమ దేశంలో పర్యటించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ ఉక్రెయిన్  పర్యటన ఖరారైంది. ఆగస్టు 23న ఆయన కీవ్‌ను సందర్శించనున్నారు.

ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో వివాదం పరిష్కరించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ దౌత్యం, చర్చలను సమర్థిస్తుందని తెలిపింది. ఆగస్టు 23న ప్రధాని మోదీ , ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ కానున్నారని పేర్కొంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం అంశంపైనా ఇరువురు నేతలు చర్చించనున్నట్లు వెల్లడించింది. అయితే ఉక్రెయిన్‌ కంటే ముందు ప్రధాని పోలండ్‌లో పర్యటించనున్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత ప్రధాని మోదీ కీవ్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

Share post:

లేటెస్ట్