‘పోలీసులు మాకు లంచం ఇవ్వాలనుకున్నారు’.. కోల్​కతా డాక్టర్ ఫ్యామిలీ ఆరోపణలు

ManaEnadu:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార కేసు (Kolkata Doctor Rape and Murder)లో రోజుకో కీలక విషయం బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని అన్నారు. హడావుడిగా తమ కుమార్తె దహన సంస్కారాలు పూర్తి చేయించారని, తమకు లంచం కూడా ఇవ్వడానికి ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

వైద్యురాలిపై హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాత్రి కోల్‌కతా (Kolkata Protests)లో జరిగిన ఆందోళనల్లో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొని ఈ విషయాలు తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా కేసును అణగదొక్కేందుకు పోలీసులు ప్రయత్నించారని మృతురాలి తండ్రి ఆరోపించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా మమ్మల్ని అనుమతించలేదని.. పోస్ట్‌మార్టం పూర్తయ్యేంతవరకు పోలీస్‌స్టేషన్‌లోనే నిరీక్షించేలా చేశారని తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని అప్పగిస్తుండగా.. ఓ సీనియర్‌ పోలీసు అధికారి తమ వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్‌ చేశారని.. అయితే తాము దాన్ని తిరస్కరించామని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ కేసుపై తొలుత దర్యాప్తు చేపట్టిన కోల్‌కతా పోలీసుల (West Bengal Police) తీరుపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం దీనిపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సంజయ్‌ రాయ్‌ సహా ఘటన చోటుచేసుకున్న ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్​ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

Share post:

లేటెస్ట్