Mana Enadu:తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులు వానలు (Heavy Rains in Telugu States) దంచికొట్టాయి. పల్లెలు, పట్టణాలు చాలా వరకు జలదిగ్బంధమయ్యాయి. చాలా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇక రహదారులపైకి వరద ముంచెత్తి చెరువులను తలపించాయి. ఎక్కడ చూసినా వరదే (Telangana Floods) కనిపిస్తోంది. కనుచూపు మేరంతా నీళ్లే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో ఉన్న వారు, తమ ఇళ్లు ముంపులో మునిగిపోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా వానాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) రావడం కామన్. కానీ గత రెండ్రోజుల నుంచి వరణుడు సృష్టించిన వర్ష బీభత్సంతో చాలా ప్రాంతాలు ముంపునకు గురి కావడంతో అక్కడున్న ప్రజలను ఇప్పుడు సీజనల్ వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. కాస్త అజాగ్రత్తగా ఉంటే ఈ వ్యాధుల బారిన పడటం ఖాయం. అందుకే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ కాలంలో దోమలు అధికంగా ప్రబలే అవకాశం ఉండటం వల్ల విషజ్వరాల (Viral Fevers) బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందువల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి ముంపు ప్రాంతాల్లో ఉన్న వారు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..?
వర్షాకాలంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
మీ ప్రాంతం ముంపునకు గురై మీ ఇంట్లోకి వరద వస్తే మొదటగా ఇంట్లోని కూలర్లు, కుండీలు, డ్రమ్ముల లాంటి వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
వరద తగ్గినా నీటిగుంతలు, మురుగు నీరు ఇంకా అలాగే ఉంటే వాటిపై కిరోసిన్ చల్లితే దోమలు (Mosquitos) రావు.
సాయంత్రం కాగానే ఇంటి తలుపు మూసేస్తే దోమలు దరిచేరవు
బయటి ఫుడ్ తీసుకోకుండా ఇంట్లోనే వండుకుని వేడివేడి ఆహారాన్ని (Fresh Food) తీసుకోవాలి
జ్వరం వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
వర్షాలు తగ్గే వరకు కాచి చల్లార్చిన నీటి (Hot Water)ని తాగడం ఉత్తమం.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంట్లో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది కాబట్టి ఎప్పుడూ ఇళ్లు పొడిగా ఉండేలా చూసుకోవాలి.
ఇక ఎంత జాగ్రత్తగా ఉన్నా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పి, పొడి దగ్గు లాంటి రోగాలు వస్తుంటాయి. ఇవేవే 80 నుంచి 85% వరకు వైరల్ వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి వీటి బారిన పడగానే మొదట పారాసెటమాల్ గోలీలు వేసుకుని అయినా తగ్గకపోతే ఒకరోజు చూసి మరుసటి రోజు వైద్యులను సంప్రదించాలి.