ManaEnadu:బయట వాతావరణం చల్లచల్లగా ఉంది. చిరుజల్లులు (Telangana Rains) కురుస్తున్న ఈ చల్లని రోజున వేడివేడిగా స్నాక్స్ తింటే ఉంటది. వాహ్వా.. ఊహిస్తుంటేనే నోరూరిపోతోంది. సాధారణంగా వర్షం పడినప్పుడు చాలా మంది పాప్ కార్న్ (Popcorn), బజ్జీలు, సమోసాలు, పకోడీల వంటివి తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇలా బరువు పెరిగే ఆహారపదార్థాలు కాకుండా.. నోటికి టేస్టీగా ఉంటూనే.. శరీరానికి ఆరోగ్యాన్ని అందించే హెల్దీ స్నాక్స్ (Healthy Snacks) చేసుకుంటే భలే ఉంటుంది. మరి చిరుజల్లులు కురుస్తున్న వేళ ఆరోగ్యంగా ఈ స్నాక్స్ ను ఆరగించండి..
మొక్కజొన్నతో మస్త్ మజా..
వర్షా కాలం ప్రారంభం కాగానే ప్రతివీధిలో జనాన్ని ఆకర్షించేది మొక్కజొన్నలు (మక్క బుట్టాలు (Corn)). వేడివేడిగా వీటిని తింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇక మొక్కజొన్న వల్ల డయాబెటిస్, హైపర్‌టెన్షన్ (Hyper Tension) వంటివి దరిచేరకుండా ఉండటమే గాక శరీరానికి అవసరమయ్యే శక్తి కూడా అందిస్తుంది. మొక్కజొన్న కాల్చికుని తినడమే కాకుండా.. స్వీట్ కార్న్, కార్న్ బజ్జీలు కూడా మీకు ఆరోగ్యాన్ని అందిస్తాయి.
గరమ్ గరమ్ చాయ్ నోట్లే వేస్తే హాయి..
బయట చల్లగా వాన కురుస్తున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది కదా. అందుకే చాలా మంది టీ, కాఫీలు తాగుతుంటారు. వీటికి బదులుగా ఈ సమయంలో గ్రీన్ టీ (Green Tea), అల్లం టీ తాగడం మంచిది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity)ని పెంపొందిస్తాయి.
హాట్ హాట్ సూప్ తాగితే అదుర్స్..
డైట్ లిస్ట్‌లో ఉండే వాటిలో సూప్ కూడా ఒకటి. రకరకాల కూరగాయలతో చేసిన సూప్ లేదా చికెన్, మటన్.. వంటి వాటితో తయారుచేసే సూప్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. బీట్‌రూట్ అండ్ క్యారట్ సూప్, చికెన్ (chicken Soop) అండ్ కార్న్ నూడుల్ సూప్, బ్లాక్ ఐ బీన్ వెజిటబుల్ సూప్.. లాంటి రుచికరమైన సూపులు శరీరానికి మేలు చేస్తాయి.
సాబుదానా వడ తింటే అదిరెను కదా..
ప్రొటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉండే సగ్గుబియ్యాన్ని వర్షాలు కురుస్తున్న సమయంలో తింటే ఎంతో మంచిది. వేడివేడి వడలను స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండచ్చు.
ఛాట్, నూడుల్స్.. అదిరిపోయే స్నాక్స్
ఇంట్లో వివిధ రకాల కూరగాయలతో చేసిన హెల్దీ ఛాట్ లేదా నూడుల్స్‌ని స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా అటు వర్షాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఈ వర్షాకాలంలో ఈ హెల్దీ స్నాక్స్ ను మీరూ ఎంజాయ్ చేయండి.