Mana Enadu:పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్(vinesh phogat)పై అనర్హత వేటు పడటంతో యావత్ భారతావనీ షాక్‌లో కూరుకుపోయింది. పక్కా పతకం ఖాయమని అంతా అనుకున్న వేళ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(IOC) భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఫొగాట్ 100 గ్రాములు అధికంగా ఉన్నారంటూ అసలు పోటీలో పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది. దీంతో బాధాతప్త హృదయంతో ఫొగాట్ వెనుదిరిగింది. భారత అభిమానులూ తీవ్ర నిరాశ చెందారు. కానీ ఇవాళ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అభిమానులు సంతోషపడేలా, భారత్ గర్వపడేలా చేసింది.
పారిస్(Paris)లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ మరోసారి తన సత్తా చాటింది. అద్వితీయ ఆటతీరుతో స్పెయిన్‌పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి కాంస్యం (Bronze Medal) కొల్లగొట్టింది. పసిడి వేటలో (జర్మనీపై 3-2 గోల్స్ తేడాతో) తడబడిన టీమ్ ఇండియా(Team India) కంచు పోరులో మాత్రం జూలు విదిల్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) డబుల్ గోల్స్‌తో రాణించడంతో స్పెయిన్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు 4వ మెడల్ అందించడంతో పాటు 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో కంచు మోత మోగించింది.
ధ్యాన్ చంద్ హయాంలో
గతంలో ప్రపంచ హాకీ(Hockey) హిస్టరీలో భారత్‌కు ఎదురేలేదు. మేజర్ ధ్యాన్ చంద్(Dhyan Chand) హయాంలో జైత్రయాత్ర కొనసాగిస్తూ పసిడి పతకాలను కొల్లగొట్టింది. 1968లో మెక్సికోలో జరిగిన ఒలింపిక్స్‌లో, 1972లో మ్యూనిచ్ (జర్మనీ) ఆతిథ్యమిచ్చిన విశ్వ క్రీడల్లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ 52 ఏళ్ల తర్వాత కాంస్యంతో చరిత్ర సృష్టించింది. మొత్తంగా ఒలింపిక్స్‌లో హాకీలో భారత జట్టు పతకాల సంఖ్యను 13కు చేర్చింది. దీంతో, యావత్ దేశం హాకీ యోధుల చిరస్మరణీయ విజయాన్ని పడుగలా జరుపుకుంటోంది.
ప్రధాని మోదీ విషెస్..
హాకీ జట్టు విజయంపై ప్రధాని మోదీ(Pm modi) కూడా హర్షం వ్యక్తం చేశారు. ‘‘భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా భారత్‌కు మరో విజయమని ట్వీట్ చేశారు. ‘భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇది మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఒలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం. నైపుణ్యం, పట్టుదలకు స్ఫూర్తి ఈ విజయం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ప్రదర్శన చేశారు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.