Mana Enadu: ఫేక్ ఫొటోల(Fake Photos)తో అబద్ధపు అందాన్ని చూపి మాయచేస్తారు. మాటలతో మైమరిపిస్తారు. నువ్వు లేక నేను లేను అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఈ మాయను చూసి భ్రమపడితే అంతే సంగతి. కి‘లేడీ’ల వలపు వలలో చిక్కినట్లే! హనీ‘ట్రాప్’(Honeytrap)లో బంధీ అయినట్లే! ఆన్‌లైన్(Online)లో వివిధ వేదికల ద్వారా పరిచయమయ్యే ఈ కి‘లేడీ’లు అమాయకులను లక్ష్యంగా చేసుకొని అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. మత్తెక్కించే మాటలు మాట్లాడుతూ.. ఆన్‌లైన్ సర్వీసులు అంటూ చాలామంది దగ్గరి నుంచి డబ్బు లాగుతున్నారు. నటించి, నవ్వించి, నమ్మించి వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోల(Photos)ను, ప్రైవేట్ వీడియోల(Private videos)ను సేకరిస్తూ.. ఆ సేకరించిన వాటితోనే బ్లాక్‌మెయిల్(Blackmail) చేస్తున్నారు. నిలువునా ముంచేస్తున్నారు. సాంకేతికత(Technology) సాయంతో వారు అంత సులువుగా ఈ నేరాలకు ఎలా పాల్పడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కవ్విస్తూ.. నవ్విస్తూ..10 లక్షలకు ఎర
సామాన్య పౌరుల నుంచి డబ్బు గుంజడానికి ఇప్పుడు ఇదో పెద్ద ఆయుధంలా మారిపోయింది. కాకినాడకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్(Hyderabad)లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పగలంతా బుర్ర పాడయ్యేలా పని చేసి.. గదికి చేరిన ఆ పాతికేళ్ల యువకుడిని సోషల్ మీడియా సేదదీర్చేది. అంతలోనే ఆ యువకుడికి ఇన్‌స్టా(Instagram)లో ఓ యువతి పరిచయమైంది. ఆమె అందమైన చిత్రాలు చూసి ఒళ్లు మరిచిన అతడు మెసెంజర్‌లోకి వెళ్లి చాటింగ్(Chating) మొదలెట్టాడు. కవ్విస్తూ నవ్విస్తూ ఆమె చెప్పే కబుర్లకు పూర్తిగా పడిపోయాడు. ఒకరోజు ఆమె నగ్నంగా వీడియోలో మాట్లాడమని కోరగానే ముందూవెనకా ఆలోచించకుండా.. పోజులిచ్చేశాడు. ఆమె మాత్రం అతడికి కనిపించకుండా.. ఊరిస్తూ అతడి వీడియోలను సేకరించింది. ఆ తర్వాత వీడియోలను బయటపెట్టకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ దాదాపు 10 లక్షల వరకు వసూలు చేసింది. దాచుకున్న డబ్బంతా అయిపోయిన తర్వాత కూడా ఆమె టార్చర్ చేయడంతో పోలీసులను సంప్రదించాడు. తీరా విచారణ జరపగా.. ఇన్నిరోజులు తనతో చాట్ చేసింది ఓ పురుషుడని తెలిసి అవాక్కయ్యాడు.
ప్రాణాలు తీసుకున్న ఘటనలు అనేకం
☞ మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన కిషన్ అనే యువకుడు అశ్లీల చిత్రాలకు అలవాటు పడ్డాడు. అనేక డేటింగ్ సైట్స్(Dating sites)లో మొబైల్ నంబర్‌తోనే లాగిన్ అయ్యాడు. ఓరోజు ఓ యువతి అతడికి వీడియోకాల్ చేసి.. అదంతా రికార్డు చేసింది. కేవలం అతను మాత్రమే కనిపించేలా ఆ వీడియోను ఎడిట్ చేసి.. డబ్బులు డిమాండ్ చేసింది. లేకపోతే ఆ వీడియోను బంధువులకు, సన్నిహితులకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది. దీంతో అతడికి ఏమీ తోచక సూసైడ్ చేసుకున్నాడు.
☞ పెళ్లిళ్లకు క్యాటరింగ్ గర్ల్‌గా వెళ్లే ఓ మహిళ.. పెళ్లికి వచ్చే రిచ్ కిడ్స్‌కి తన నంబర్ ఇచ్చేది. ఆ తర్వాత రూమ్‌కి ఆహ్వానించేది. తీరా వారు రూమ్‌కి రాగానే తనపై అత్యాచారం జరిగినట్లు నాటకం ఆడి.. డబ్బులు వసూలు చేసేది. ఈమె వలలో పడిన ఓ పీజీ కుర్రాడు.. తనపై పోలీసు కేసు అవుతుందని భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఉదంతం బయటపడింది. ఇలాంటి ఘటనలు నిత్యం వందల్లో జరుగుతున్నా.. కానీ బయటకు వచ్చేది మాత్రం పదుల సంఖ్యలోనే. అందుకే ఆన్‌లైన్ మోసాలపట్ల(Cyber threats), సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.







