Mana Enadu: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్ బలయ్ కార్యక్రమం. అన్ని వర్గాల ప్రజలను, అన్ని పార్టీల రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఓ గొప్ప వేడుక. కుల, మతాలకు అతీతంగా ఏటా దసరా పండుగ తర్వాతి రోజు ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దీనికి వేదికగా నిలుస్తోంది. ఈ వేడుకకు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు తప్పక హాజరువుతూ ఉంటారు. బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హరియాణా గవర్నర్‌గా ఉన్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 13న జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు. ఈ విషయాన్ని సీఎం ట్వీట్ చేశారు. తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీక ఈ కార్యక్రమమని పేర్కొన్నారు.
కాగా గత పదిహేడు సంవత్సరాలుగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమం కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరుగుతోంది. దసరా తరువాత రోజు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులకు తెలంగాణ వంటకాలను రుచి చూపిస్తుంటారు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాలైన మటన్, చికెన్, పాయా, హలీంతోపాటు వివిధ రకాల తెలంగాణ పిండి వంటలు కూడా అతిథులకు వడ్డిస్తారు. బండారు దత్తాత్రేయ ఎక్కాడున్నా, ఏ పదవిలో ఉన్నా, ఆయన మనసెప్పుడు హైదరాబాద్’లోనే ఉంటుందనే దానికి ఈ కార్యక్రమం ఓ ఉదాహరణ. గతంలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సైతం హాజరయ్యారు. అంతేకాదు ‘అలయ్ బలయ్’ వంటి కర్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యం, సమానత్వాన్ని పెంచుతుందని ప్రధాని మోదీ కొనియాడారు కూడా.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పేరుతో 2009 నుంచి అలయ్ బలయ్ స్నేహ సమ్మేళనం జరుగుతోంది. ఇందులో తెలంగాణ జానపద కళారూపాలైన ఒగ్గుకథలు, గోండు నృత్యం, పీర్లు, గొర్లకాపరులు, పోతరాజులు, సాధ్యశూరులు, బోణాలు, బంతిపూల బతుకమ్మ, గంగిరెద్దులు, సీతమ్మ జడకొప్పులు వంటి వాటితోపాటు, కోలాటాలు, భజనకీర్తనలు, సన్నాయి బాజాలు, జమిడిక మోతలు, బోనాలు, ఘటాలు, వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి.