ManaEnadu:హైదరాబాద్ మహానగరంలో చెరువులు, ప్రభుత్వ భూములను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్.. నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పక్కా ప్లాన్‌తో ఎలాంటి సమాచారం లేకుండా కట్టడాలు కూల్చేస్తున్నారు. ఈ కూల్చివేతలతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ల భవనాలు నాదం చెరువు బఫర్ జోన్‌లో నిర్మించారంటూ తాజాగా ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లగా.. అక్రమ నిర్మాణాలు చేసినట్లు దర్యాప్తులో తేలితే.. కూల్చివేయొచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఈ వ్యవహారంపై స్పందించారు.
హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే ఇబ్బంది పెడుతున్నారని.. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని.. హస్తం తీర్థం పుచ్చుకోగానే ఆయనపై కేసులన్నీ అటకెక్కాయని మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రంలో ప్రజలు డెంగీ జ్వరాలతో ప్రాణాలు కోల్పోతుంటే.. కనీసం ఒక్క సమీక్ష కూడా చేయకుండా రేవంత్ సర్కార్.. విపక్షాలపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఇక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను 25 ఏళ్ల నుంచి విద్యాసంస్థలు నడుపుతున్నానని.. 9 నెలలుగా రోజూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నిర్మాణాలకు గతంలో నీటిపారుదుల శాఖ అనుమతులు ఇచ్చిందని.. ఇప్పుడేమో ఆ శాఖ అధికారులే ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. తన సొంతభూమిలో మాత్రమే నిర్మాణాలు చేశానని పేర్కొన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. మీడియా సమక్షంలో సర్వే చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలు ఉంటే తానే కూలగొడతానని స్పష్టం చేశారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు.