ManaEnadu:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Excise Policy Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచడంతో మార్చి 26న కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. అప్పటి నుంచి ఆమె దిల్లీలోని తిహాడ్ జైల్లో (Tihar Jail)నే ఉన్నారు. అప్పుడప్పుడు కవిత సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), తన భర్త అనిల్, మాజీ మంత్రి హరీశ్ రావు, తల్లి శోభ కవితను జైల్లో ములాఖత్ సమయంలో కలిసి వచ్చారు. అయితే ఆమె జైలుకు వెళ్లినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, తండ్రి కేసీఆర్ మాత్రం కవితను కలవలేదు.
ఐదు నెలలకు పైగా తన కుమార్తెను కేసీఆర్ (Former CM KCR) చూడలేకపోయారు. అనారోగ్యం, ఇతర కారణాల వల్ల ఆయన దిల్లీకి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తాజాగా బెయిల్‌పై విడుదలై కవిత బుధవారం రోజున హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ శ్రేణులతో కాసేపు మాట్లాడి, తన తల్లి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో గడిపారు. ఇక ఇవాళ కవిత (Kavitha To Meet KCR) కేసీఆర్‌ను కలవనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తన మకాం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ (KCR At Erravalli)కు మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ కార్యకలాపాలు కూడా అక్కడి నుంచే చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 29వ తేదీ) మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లికి వెళ్లనున్నారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌ను ఆమె కలవనున్నారు. ఈడీ కేసులో అరెస్టయిన తర్వాత కేసీఆర్‌ను కవిత కలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.