ManaEnadu:హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రాకు కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను నియమించింది. ఈ క్రమంలో రంగనాథ్ టీమ్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నారు. హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ మొదట నగరంలోని చెరువుల ఆక్రమణపై అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఉపగ్రహ చిత్రాలను తెప్పించారు. ఆక్రమణల తీరును నిపుణులతో అంచనా వేయించారు. అక్రమ కట్టడాల జాబితాను సిద్ధం చేసి మొదటి వారం నుంచే కూల్చివేతలు షురూ చేశారు. ఇలా నగరంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన ఆయన బృందం.. పక్కా ప్లాన్‌తో మూడో కంటికి తెలియకుండా రంగంలోకి దిగుతోంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా ముప్పేట దాడి చేస్తోంది.
గతంలో బల్దియా, హెచ్ఎండీఏ అధికారులు పాక్షికంగా కూల్చడం, స్లాబులకు రంధ్రాలు చేయడం వంటివి చేసి అక్కడితో మమ అనిపించే వారు. కానీ హైడ్రా మాత్రం మొత్తం భవనాలను పునాదుల నుంచి నేలమట్టం చేస్తోంది. కూల్చివేతల సమాచారాన్ని ఏమాత్రం బయటకు రానివ్వకుండా పక్కా ప్రణాళికలతో దూసుకెళ్తోంది. ఇక అందరూ సేదతీరే వీకెండ్ (శని, ఆదివారాలు)ను తన పని కానిచ్చేందుకు వినియోగించుకుంటోంది.
రంగనాథ్ అండ్ టీమ్ ప్లానింగ్ ఎలా ఉందంటే?
ముందుగా రంగనాథ్ అండ్ టీమ్.. అక్రమ నిర్మాణాలను గుర్తిస్తుంది. ఆ తర్వాత సిబ్బంది మఫ్టీలో వెళ్లి అక్కడి భవనాలు, కట్టడాలను పరిశీలిస్తారు. వాటిని కూల్చేందుకు ఎంత సమయం పడుతుంది? ఏయే వాహనాలు అవసరం? వంటి అంశాలను అంచనా వేస్తారు. ఆ తర్వాత ఆ విషయాన్ని తమ బాస్ రంగనాథ్‌తో చర్చిస్తారు. ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం.. ముందురోజు రాత్రి సిబ్బంది, యంత్రాలను రెడీ చేసుకుంటారు. ఇక తెల్లవారగానే రంగంలోకి దిగి వంతుల వారీగా సిబ్బంది బ్రేక్ లేకుండా కట్టడాలను కూల్చేస్తున్నారు. అయితే ఈ విషయం లీక్ కాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ జాగ్రత్తపడుతున్నారు. ఇన్ఫర్మేషన్ లీకైతే సస్పెండ్ చేస్తానని సిబ్బందిని, అధికారులను హెచ్చరించడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. హైడ్రా ఏర్పాటైన రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.