Khammam|అన్నా ఈయేడు నీకు రాఖీ కట్టలేకపోతున్నా.. రక్షాబంధన్ కు దూరమైన ఖమ్మం జిల్లా ఆడబిడ్డలు

ManaEnadu:అమ్మలా ప్రేమ కురిపిస్తూ.. నాన్నలా కంటికి రెప్పలా కాపాడతాడు అన్న. అమ్మలోని అ.. నాన్నలోని న్న.. కలిస్తేనే అన్న. అలా తండ్రిలా కంటికి రెప్పలా చెల్లెలిని చూసుకుంటాడు అన్న. చెల్లెలు కూడా అంతే.. తల్లిలా తన సోదరుడిపై ప్రేమ కురిపిస్తుంది. కాసేపు పొట్లాడుకున్నా.. క్షణంలో కలిసిపోతారు. ఏడు సముద్రాల అవతల ఉన్నా.. కష్టకాలంలో చెల్లి తలుచుకుంటే క్షణంలో ముందుంటాడు అన్న. చెల్లి కూడా అంతే.. అన్నకు ఏదైనా ఆపద వస్తే కన్నతల్లిలా తల్లడిల్లిపోతుంది.  అందుకే అంటారు.. అన్నా చెల్లెలి అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం .. అక్కాతమ్ముడి అభిమానం జీవితకాలం సంతోషం అని.

అలాంటి అపూరమైన అనురాగానికి, ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన రాఖీ పౌర్ణమి వస్తోంది. ఇప్పటికే అక్కాచెల్లెల్లు తమ అన్నాదమ్ముల కోసం రాఖీలు కూడా కొనుగోలు చేసేస్తున్నారు. మరోవైపు సోదరులేమో.. తమ సోదరీమణుల కోసం బహుమతులు సిద్ధం చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉండి తమ సోదరులతో కలిసి పండుగ జరుపుకోలేని వారు వారి కోసం ఆన్ లైన్ లో, పోస్టుల్లో రాఖీని పంపుతున్నారు.

దేశమంతా రాఖీ పౌర్ణమి పండుగ సందడి నెలకొంటే ఖమ్మం జిల్లాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఈ జిల్లాలో రక్షా బంధన్ జరుపుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఓవైపు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో కొంతమంది బాధ పడుతుంటే.. మరోవైపు వింత జ్వరాలతో ఇక్కడి జనం ఇబ్బందులు పడుతున్నారు. కాళ్లు, చేతులు వాపులతో పాటు ఒళ్లు నొప్పులతో ఈ జిల్లాలో ఇంటిల్లిపాది మంచాన పడ్డారు. 

ఇంట్లో కుటుంబ సభ్యులంతా మంచాన పడటంతో వారిని చూసుకునే వారే కరవయ్యారు. రోజుల తరబడి జ్వరంతో బాధపడి చివరకు తగ్గిన తర్వాత చర్మ సమస్యలతో బాధపడుతున్నారు ఇక్కడి జనం. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా తమ వ్యాధి తగ్గడం లేదని వాపోతున్నారు. మరోవైపు సోమవారం రోజున రాఖీ పౌర్ణమి పండుగ వస్తోంది. ఈ తరుణంలో తమ సొంత అన్నదమ్ములకు రాఖీ కట్టే పరిస్థితిల్లో కూడా లేమంటూ ఇక్కడి మహిళలు వాపోతున్నారు. మంచం దిగే పరిస్థితుల్లో కూడా లేమని.. ఇలాంటి స్థితిలో తమ సోదరుల వద్దకు ఎలా వెళ్లి రాఖీ కట్టగలమని బాధపడుతున్నారు.

చిన్నప్పటి నుంచి రాఖీ కట్టకుండా ఎప్పుడూ లేమని.. ఇప్పుడు ఇలా మంచాన పడటంతో ఈసారి రక్షా బంధన్ జరుపుకునే పరిస్థితులు కనిపించడం లేదని వాపోతున్నారు. తాము బతికే ఉన్నా తమ అన్నాదమ్ములు ఈసారి రాఖీ కట్టుకోకుండా ఉండాల్సి వస్తోందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒకవేళ వారినే తమ వద్దకు రమ్మందామన్నా.. తమకు వచ్చిన జ్వరం ఏంటో అర్థం కావడం లేదని.. పైగా చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయని.. తమ వల్ల వారికి కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుందేమోనని భయంగా ఉందని అంటున్నారు.

మరోవైపు తమ సోదరీమణులు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటంతో వారి అన్నదమ్ములు కూడా ఆందోళన చెందుతున్నారు. జీవితాంతం రక్షగా నిలుస్తామని మాట ఇచ్చిన తాము.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. కొందరేమో తమ అక్కా చెల్లెల్ల వద్దకు వెళ్లి స్వయంగా తామే రాఖీ కట్టించుకుంటామని చెబుతుంటే.. మరికొందరేమో వెళ్లలేని పరిస్థితుల్లో ఉండి.. ఈసారి పండుగ జరుపుకోలేక పోతున్నామని బాధపడుతున్నారు. మొత్తానికి మంచం పట్టిన ఖమ్మం జిల్లాలో చాలా మంది రాఖీ పండుగకు దూరమైపోతున్నారు. 

Related Posts

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగియడంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) వెల్లడించింది. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం…

ముక్కలేనిదే ముద్ద దిగదక్కడ.. దేశంలో అతిగా మాంసం తినే 10 రాష్ట్రాలివే

పండుగ ఏదైనా.. సందర్భం ఏదైనా.. పార్టీ చేసుకోవండ ఇప్పుడు పరిపాటిగా మారింది. ఇక ఆ పార్టీలో నాన్ వెజ్ (Non Veg) మాత్రం పక్కాగా ఉండాల్సిందే. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అంతలా మన జీవితంలో మాంసాహారం భాగమైపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *