తెలంగాణలో పొలిటికల్ హీట్.. కౌశిక్ రెడ్డి Vs అరెకపూడి.. అసలేంటీ వివాదం?

ManaEnadu:రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ (Political Heat) నెలకొంది. అసలు ఈ ఇద్దరి మధ్య వివాదం ఏంటి? ఆ వివాదానికి కారణమేంటి? ఈ వివాదం ఎక్కడ మొదలైంది అంటే?

ఇదీ అసలు వివాదం
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా నియమిస్తూ శాసనసభాపతి నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని ఖండించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు, తమ పార్టీ తరఫున గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేకు పీఏసీ ఛైర్మన్‌ (PAC Chairman) పదవి ఇవ్వడంపై విమర్శించారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కౌశిక్ సవాల్.. అరెకపూడి కౌంటర్
మరోవైపు కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్టుగా బీఆర్ఎస్ సభ్యుడైన అరెకపూడి గాంధీ (Arekapudi Gandhi) తెలంగాణ భవన్‌కు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అరెకపూడి ఇంటికి వెళ్తానని, బీఆర్ఎస్ కండువా కప్పుతానని కౌశిక్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దీనిపై అరెకపూడి ఘాటుగా స్పందిస్తూ ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి గెలిచిన కౌశిక్‌రెడ్డిలాంటి కోవర్టులకు తన గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. తన ఇంటికి ఆయన రాకపోతే.. తానే ఆయన ఇంటికి వెళతానన్నారు.

కౌశిక్ ఇంటి వద్ద ఉద్రిక్తతత
అన్నట్లుగానే అరెకపూడి తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్‌రెడ్డి (MLA Kaushik Reddy) ఇంటికి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు అరెకపూడి గాంధీని పంపించే ప్రయత్నం చేయగా.. కౌశిక్‌రెడ్డిని బయటకు పిలవాలని.. లేదంటే తననే లోపలికి పంపించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు గాంధీని అరెస్టు చేశారు.

కౌశిక్ ఓ కోవర్టు
అంతకుముందు గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS Party) కండువా కప్పుకున్నప్పటి నుంచి కౌశిక్ తీరు సరిగ్గా లేదని, ఆయన వల్లే గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని అన్నారు. ఆయన కోవర్టుగా వ్యవహరించారని, కౌశిక్ తీరు తెలుసుకోకుండా పార్టీలో చేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

మా తడాఖా చూపిస్తాం
మరోవైపు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే (MLA)కే రక్షణనే లేదని, సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణకు ఎలా ఇస్తుంది? అని ప్రశ్నించారు. హత్య చేయడానికి తన ఇంటి వద్దకు వచ్చారని, రేపు 11 గంటలకు బీఆర్‌ఎస్‌ పార్టీ తడాఖా చూపిస్తామని మరో సవాల్ విసిరారు. ఇవాళ అరెకపూడి గాంధీ చేసిన చర్యకు రేపు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. 

Share post:

లేటెస్ట్